పుట:సత్యశోధన.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వమానవ సంతతికి మార్గదర్శకమై ఉంటుంది. డా॥ ఆల్బర్ట్ ఐన్‌స్టెయిన్ ఉద్వేగభరితంగా అన్న మాటలు ఇవి; ముందుతరాల వారు ఇటువంటి మహనీయుడు, భౌతిక శరీరంతో ఈ భూమిని పావనం చేశాడు - అనుమాట విశ్వసిస్తారో - లేదో . అట్టివాడు ఆ మహాత్ముడు.”

అర్ధ శతాబ్ది క్రితం, మహాత్మాగాంధీ స్థాపించిన నవజీవన ట్రస్టు వారు గాంధీ జయంత్యుత్సవాలలో భాగంగా, ఆరు సంపుటాలలో “ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలు” ప్రచురించ నిర్ణయించారు. భారతదేశ ప్రజానీకానికి, విశ్వవ్యాప్త మానవాళికి “సత్యం, కారుణ్యం” శాశ్వతత్వాన్ని తిరిగి ఒకసారి ప్రబోధింపజేయడమే ఈ ప్రచురణల ధ్యేయం. ఈ సంపుటాల ప్రధాన సంపాదకుడుగా నేను - విశ్వమంతా ఉపయుక్తమయ్యే శాశ్వత విలువలతో ప్రోది చేసిన మహాత్ముని రచనల అంశాలను ఏర్చి కూర్చడానికి యథాశక్తి ప్రయత్నం చేశాను. మొదటి రెండు సంపుటాలలో “సత్యాన్వేషణకై, నా ప్రయోగాల కథ” అనే పేరుతో ప్రసిద్ధమైన గాంధీ ఆత్మకథ, మూడవ దానిలో “దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం”, నాల్గవ సంపుటంలో గాంధీజీ మూలసిద్ధాంత రచనలు “నైతికమతం” “ఈ చివరికి” “హింద్ స్వరాజ్” “యరవాడ మందిరం నుంచి” “నిర్మాణాత్మక కార్యక్రమాలు” “ఆరోగ్యదీపిక” అనే రచనలనూ అయిదవ సంపుటంలో వివిధములైన ప్రధాన విషయాలపై గాంధీజీ ఆభిప్రాయాలనూ, చారిత్రిక ఉత్సుకతను పెంపొందించే గాంధీజీ ఉత్తరాలనూ

ఆరవ సంపుటంలో ఆధ్యాత్మికత, మతం, సంస్కృతి, ఆర్థిక ప్రయోగాలు, రాజకీయాలు, సామాజిక సంబంధాలు, విద్య మొదలైన వాటిపై గాంధీజీకి గల గట్టి నమ్మకాలను క్రోడీకరించి సంపుటీకరించాను. ఎంపిక చేసిన ఈ రచనలు - జీవితంలో వివిధ విషయాలపై గాంధీ అభిప్రాయాలను తెలియగోరిన వారికి ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తున్నాను.

ఈ సందర్భంగా, ఈ సంపుటాలను దేశ, విదేశాల పాఠకులకు అందించే అవకాశం నాకు కలిగించిన నవజీవన ట్రస్టు వారికి నా కృతజ్ఞతలు. ఈ గ్రంథాల కూర్పులో నాకు సహకరించిన శ్రీ హెచ్. ఎమ్. వ్యాస్ గార్కి డా. రమ్ మోడీ గార్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

రాజ్ భవన్
అహమదాబాదు
ఆగస్టు 15, 1968

శ్రీమన్నారాయణ