పుట:సత్యశోధన.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

35

అతను మంచివాడు. నీవే ఉత్తరం వ్రాయి. మన కుటుంబాన్ని గురించి తెలిస్తే తప్పక అనుమతిస్తాడు. సహాయం కూడా చేయవచ్చు.” అని అన్నారు

నేను సిఫారసు చేయమని అడిగితే మా పినతండ్రి ఎందుకు అంగీకరించలేదో నాకు బోధపడలేదు. సముద్రయానానికి ప్రత్యక్షంగా సాయం చేయడం ఆయనకు ఇష్టం లేదని నాకు గుర్తు.

లేలీగారికి జాబు వ్రాశాను. వారి అనుమతి తీసుకుని కలుద్దామని వెళ్ళాను. మేడమీద ఎక్కుతూ ఆయన నన్ను చూచాడు. బి.ఏ. పూర్తిచేయి. తరువాత వచ్చి కలు. నీకు ఇప్పుడు ఏమీ సాయం లభించదు. అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నేను ఆయనను చూడడానికి బాగా తయారైవచ్చాను. వారికి చెప్పాలని కొన్ని మాటలు కూడా వ్రాసుకుని బాగా వల్లించాను. వంగి వంగి రెండు చేతులతో సలాం చేశాను. కాని అంతా వృధా అయిపోయింది.

తరువాత ఆలోచించాను. నా భార్య నగలపైనా దృష్టి పడింది మా అన్నగారిమీద నాకు అపరిమిత విశ్వాసం. ఆయన ఉదార హృదయుడు. ఆయనకు నాపై పుత్రవాత్సల్యం. నేను పోరుబందర్ నుండి రాజకోటకు వచ్చాను. జరిగినదంతా చెప్పాను. జోషీగారితో కూడా మాట్లాడాను. అవసరమైతే అప్పు చేసైనా ఇంగ్లాండు వెళ్ళమని ఆయన సలహా ఇచ్చాడు. నా భార్య నగలు అమ్మితే రెండు మూడు వేల రూపాయలు వస్తాయనీ, వాటిని అమ్మి ఇంగ్లాండుకు వెళతానని అన్నాను. మా అన్నగారు ఏదో విధంగా డబ్బు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు.

కాని మా అమ్మకు ఇష్టం లేదు. ఆమె ఏవో వంకలు చెప్పడం మొదలు పెట్టింది. ఇంగ్లాండు వెళ్ళే యువకులు చెడిపోతారని ఎవరో ఆమెకు చెప్పారు. అక్కడి వాళ్ళు గోమాంసం తింటారని, మద్యం త్రాగందే బ్రతకలేరని కూడా చెప్పారు. “ఇదంతా ఏమిటి?” అని ఆమె నన్ను అడిగింది. “అమ్మా! నన్ను నమ్మవా? నేను నీకు అబద్ధం చెబుతానా? నేను వాటిని ముట్టుకోను. ఒట్టు పెట్టుకుంటాను. నిజానికి అటువంటి అపాయమేవుంటే జోషీగారు వెళ్ళమని చెబుతారా?” అని అన్నాను. “నాయనా! నాకు నీమీద నమ్మకం ఉన్నది. కానీ దూరదేశం కదా! ఎట్లా నమ్మడం? నాకు ఏమీ తోచడం లేదు. బేచర్జీ స్వామిని అడిగిచూస్తాను” అని ఆమె అన్నది.

బేచర్జీ స్వామి మోఢ్ వైశ్యులు. మధ్యలో ఆయన జైన సాధువుగా మారారు. జోషీగారివలెనే వారు కూడా మా కుటుంబహితైషి. వారిని కలిశాము. “ఇతని చేత మూడు వాగ్దానాలు చేయించి ఇంగ్లాండుకు పంపవచ్చు” అని చెప్పి “మద్యం,