పుట:సత్యశోధన.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

సీమకు ప్రయాణ సన్నాహం

మా అన్నగారు ఆలోచనా సాగరంలో మునిగిపోయారు. నన్ను ఇంగ్లాండు పంపడానికి డబ్బు ఎక్కడినుంచి తేవడం? ఒంటరిగా ఉన్నవాణ్ణి ఇంగ్లాండుకు ఎలా పంపడం? ఈ మధనలో అన్నగారు పడ్డారు

మా అమ్మగారు కూడా చింతలో పడిపోయింది. నన్ను విడిచి వుండలేదు. నా ఎడబాటు ఆమె సహించలేదు. అందువల్ల ఒక ఉపాయం ఆమెకు తట్టింది. “మన కుటుంబ పెద్దలు మీ పినతండ్రిగారున్నారు కదా! మొదట వారితో సంప్రదిద్దాం. వారు అంగీకరిస్తే తరువాత ఆలోచిద్దాం” అని ఆమె అన్నది.

మా అన్నగారికి మరో ఊహ కలిగింది. “పోరుబందరుపై మనకు కొంత హక్కు వున్నది. అక్కడ లేలీగారు పెద్ద అధికారి. మన కుటుంబమంటే వారికి గౌరవం. మన పినతండ్రిగారంటే వారికి ప్రత్యేక అభిమానం. నీ విద్యా వ్యయానికి సంస్థానం పక్షాన కొంత సహాయం అందజేసి వారు తోడ్పడవచ్చు” అని నాతో అన్నారు.

వారి మాటలు నాకు నచ్చాయి. పోరుబందరుకు ప్రయాణమైనాను. ఆ రోజుల్లో రైళ్ళు లేవు. ఎద్దుబండిమీద ప్రయాణం చేయాలి. నాకు పిరికితనం ఎక్కువ అని ముందు వ్రాశాను. అయితే ఇంగ్లాండుకు వెళ్ళాలనే ఉత్సాహం కలగడం వల్ల దాని ముందు నా పిరికితనం పటాపంచలైపోయింది. ధోరాజీ వరకు ఎడ్లబండిలో వెళ్ళాను. ఒంటెమీద ప్రయాణం సాగించాను. ఒంటె ప్రయాణం మొట్టమొదటిసారి చేశాను.

పోరుబందరు చేరాను. మా పినతండ్రిగారికి సాష్టాంగప్రణామం చేశాను. విషయమంతా వారికి చెప్పాను. వారు అంతా విని కొంచెం సేపు ఆలోచించి యిలా ఉన్నారు. “ఇంగ్లాండులో స్వధర్మ రక్షణ సాధ్యపడుతుందని నాకు అనిపించడంలేదు. నేను విన్న విషయాల్ని బట్టి అక్కడ స్వధర్మరక్షణ అసంభవమని భావిస్తున్నాను. అక్కడికి వెళ్ళివచ్చిన బారిష్టర్లను చూస్తున్నాను. వీళ్ళకు ఆ తెల్లవాళ్ళకు భేదం కనబడటం లేదు. ఆహారం విషయంలో వారికి నిషేధాలు లేవు. చుట్ట ఎప్పుడూ వారి నోట్లో ఉండవలసిందే. ఇంగ్లీషువాళ్ళ దుస్తులు సిగ్గులేకుండా ధరిస్తారు. అది మన కుటుంబ సంప్రదాయం కాదు. నేను కొద్దిరోజుల్లో తీర్ధయాత్రకు బయలుదేరుతున్నాను. నేను యిక ఎన్నాళ్ళో బ్రతకను. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న నేను సముద్రయానానికి అంగీకరించలేను. కాని నేను నీ దారికి అడ్డం రాను. ఈ విషయంలో నిజంగా కావలసింది మీ అమ్మగారి అనుమతి. ఆమె అంగీకరిస్తే బయలుదేరు. నేను అడ్డురానని ఆమెకు చెప్పు. నేనూ ఆశీర్వదిస్తాను.

“నాకు కావలసింది అదే. మా అమ్మగారి అనుమతి కోసం ప్రయత్నిస్తాను. మీరు లేలీగారికి సిఫారసు చేయండి” అని అడిగాను “నేను ఎలా చేస్తాను? అయితే