పుట:సత్యశోధన.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

33

లాయరు కావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ పిల్లవాడు లాయరు అయ్యేనాటికి దివాన్ పదవి కోసం చాలామంది లాయర్లు తయారవుతారు. అందువల్ల మీ పిల్లవాణ్ణి ఇంగ్లాండు పంపడం మంచిదని నా అభిప్రాయం. అక్కడ బారిష్టరు కావడం తేలిక అని మా అబ్బాయి కేవలరామ్ చెప్పాడు. మూడేళ్ళలో తిరిగి రావచ్చు. నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అవుతాయి. బారిష్టరై తిరిగివచ్చిన ఆ క్రొత్తవాణ్ణి చూడండి ఎంత దర్జాగా వుంటాడో, అతడు అడిగితే చాలు దివాన్‌గిరీ ఇచ్చేలా వున్నారు. కనుక ఈ సంవత్సరమే మోహనదాస్‌ను ఇంగ్లాండు పంపడం మంచిది. మా అబ్బాయి కేవల్‌రామ్‌కు ఇంగ్లాండులో మిత్రులున్నారు. వారికి పరిచయ పత్రాలిస్తాడు. అందువల్ల పిల్లవాడికి అక్కడ యిబ్బంది కలుగదు” ఈ విధంగా మా వాళ్ళకు చెప్పి జోషీగారు (దవేగారిని మా కుటుంబీకులు జోషీగారని అనేవారు) మేము అంగీకరించినట్లు భావించి నావంకకు తిరిగి “నీవు ఇక్కడ చదవడం కంటే ఇంగ్లాండులో చదువుకునేందుకు అభిలషింపవా?” అని అడిగారు. వారి మాటలు విన్న నాకు సంతోషం కలిగింది. కాలేజీలో సాగుతున్న కఠినమైన విద్యాబోధన వల్ల నేను విసిగిపోయివున్నాను. అందువల్ల వారి ఈ మాట వినగానే ఆనందపడి “ఎంత త్వరగా నన్ను పంపితే అంత మంచిది” అని అనివేశాను. పరీక్షలు త్వరగా ప్యాసు కావడం కష్టం. అందువల్ల నన్ను వైద్య చదువుకు పంపకూడదా అని అడిగాను.

మా అన్నగారు నా మాటకు అడ్డువచ్చి “నాన్నకు వైద్యమంటే ఇష్టం లేదు. మనం వైష్ణవులం. పీనుగుల్ని కోయడం మనకు పాడికాదు అని నాన్నగారు నిన్ను దృష్టిలో పెట్టుకుని అనేవారు. నీవు వకీలు కావడం నాన్నగారికి ఇష్టం” అని అన్నాడు.

వెంటనే జోషి మ అన్నగారి మాటల్ని సమర్థిస్తూ ఇలా అన్నారు. “నేను మీ నాన్నగారిలా వైద్యవృత్తిని ద్వేషించను. వైద్యవృత్తిని శాస్త్రం కూడా నిషేధించలేదు. నీవు వైద్యపరీక్ష ప్యాసైనా దివాన్ పదవి పొందలేవు. నీవు దివాన్ కావాలి. చేతనైతే అంత కంటే పెద్ద పదవి సంపాదించాలి. అప్పుడే ఈ పెద్ద కుటుంబాన్ని పోషించగలుగుతావు. రోజులు త్వరగా మారిపోతున్నాయి. రోజులు గడిచేకొద్దీ కష్టాలు పెరుగుతాయి. అందువల్ల బారిష్టరు కావడమే అన్నివిధాలా మంచిది” అని చెప్పి మా అమ్మగారి వంక తిరిగి “ఇక నాకు సెలవీయండీ. నేను చెప్పిన విషయాన్ని గురించి యోచించండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇంగ్లాండు ప్రయాణానికి సన్నాహాలు జరుపుతూ వుండండి. నేను చేయగల సాయం ఏమైనా వుంటే తప్పక చేస్తా” అంటూ జోషీ లేచి వెళ్ళిపోయారు. నేను ఆకాశ సౌధాలు నిర్మించసాగాను.