పుట:సత్యశోధన.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కుల బహిష్కరణ

మాంసం, మహిళ” లను ముట్టనని నా చేత ప్రమాణం చేయించారు. అప్పుడు మా అమ్మ అంగీకారం తెలిపింది.

హైస్కూల్లో నాకు వీడ్కోలు సభ జరిగింది. రాజకోటకు చెందిన ఒక పిన్న వయస్కుడు ఇంగ్లాండు వెళ్ళడం అక్కడ అసాధారణ విషయమైపోయింది. నేను నా కృతజ్ఞతలు తెలిపేందుకు మూడు నాలుగు వాక్యాలు ముందుగా వ్రాసి పెట్టుకున్నాను. వాటిని చదివేసరికి నాకు చెమటలు పట్టాయి. శరీరం వణికింది. ఆనాటి ఆ విషయం యిప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నది.

పెద్దల దీవెనలతో బొంబాయికి బయలుదేరాను. బొంబాయికి ఇదే నా ప్రథమ యాత్ర. మా అన్న నా వెంట బొంబాయి వచ్చారు. కాని ఇల్లు అలకగానే పండుగ అవుతుందా? బొంబాయిలో కొన్ని గండాలు దాటవలసి వచ్చింది.

12. కుల బహిష్కరణ

మా అమ్మ ఆజ్ఞను, ఆశీస్సులను పొంది పసిపాపను, భార్యను విడిచి అమితోత్సాహంతో బొంబాయికి బయలుదేరాను. జూన్, జూలై మాసాల్లో హిందూ మహాసముద్రం సామాన్యంగా ఒడిదుడుకులుగా ఉంటుంది. “మీ తమ్ముడికి ఇది మొదటి ప్రయాణం కదా! నవంబరు వరకు సముద్రప్రయాణం ఆపుకోండి. ఈ మధ్యనే తుఫాను వల్ల ఒక స్టీమరు కూడా మునిగిపోయింది” అని కొందరు మిత్రులు మా అన్నగారికి చెప్పారు. దానితో ఆయన కంగారుపడి సముద్ర ప్రయాణానికి అంగీకరించలేదు. అక్కడే ఒక మిత్రుని ఇంట్లో నాకు బస ఏర్పాటు చేసి తాను రాజకోటకు వెళ్ళి ఉద్యోగంలో చేరారు. నాకు కావలసిన ప్రయాణ వ్యయం మా బావ దగ్గర వుంచారు. వెళ్ళేప్పుడు ఇమ్మని చెప్పడమే గాక, అవసరమైన సహాయం చెయ్యమని మిత్రులకు కూడా చెప్పి మా అన్న ఇంటికి వెళ్ళిపోయారు.

బొంబాయిలో ప్రొద్దుపోవడం లేదు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ ఇంగ్లాండుకు వెళ్ళే కలవరింతలే. ఇంతలో మా కులంవారిలో కలవరం బయలుదేరింది. అంతవరకు మా కులంవారైన మోఢ్‌వైశ్యులెవ్వరూ సీమ ప్రయాణం చేయలేదు. నేను సీమ వెళుతున్నాను గనుక నన్ను కులాన్నుంచి బహిష్కరించాలని కొందరికి ఆవేశం కలిగింది. అందుకోసం ఒక సభ ఏర్పాటు చేశారు. కులస్థులు చాలామంది వచ్చారు. నన్ను పిలిపించారు. నాకు అంత సాహసం ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేనాసభకు నిర్భయంగ వెళ్ళాను. ఆ కులం పెద్ద అయిన సేఠ్ కు మా తండ్రిగారికి పరిచయం వున్నదట. ఆయన మాకు దూరబంధువుకూడానట.