పుట:సత్యశోధన.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

27

పాపం నా భార్య గాఢనిద్రలో వుంది. నేను ఆమెను నిద్రపోనిస్తానా? ఆమెను లేపాను. అయిదు ఆరు నిమిషాల తరువాత మా నౌకరు వచ్చి దబదబ తలుపు తట్టాడు. కంగారు పడిపోయాను. నాన్నగారికి జబ్బు పెరిగిందని బిగ్గరగా అన్నాడు. బాగా జబ్బులో వున్నారను విషయం నాకు తెలుసు అందువల్ల జబ్బు పెరిగందనేసరికి విషయం నాకు బోధపడింది. పక్క మీద నుంచి క్రిందికి దూకాను.

“సరిగా చెప్పు ఏమైంది?”

“తండ్రిగారు చనిపోయారు” అని సమాధానం వచ్చింది. ఆ మట విని క్రుంగిపోయాను. పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఏమిటి? ఎంతో విచారం కలిగింది. తండ్రిగారి దగ్గరికి పరుగెత్తాను. భోగవాంఛ నన్ను అంధుణ్ణి చేసింది. అందువల్లే చివరి క్షణంలో మా తండ్రిగారి శాశ్వత ప్రయాణ సమయంలో నేను వారి దగ్గర వుండలేక పోయాను. వారి వేదనలో పాలుపంచుకోలేకపోయాను. ఆ అదృష్టం మా పినతండ్రి గారికి దక్కింది. మా పినతండ్రి తన అన్నగారికి పరమ భక్తుడు. అందువల్ల ఆయనకే అంత్యకాలంలో సేవ చేసే అదృష్టం లభించింది. మరణం ఆసన్నమైందని మా తండ్రి గ్రహించారు. సైగ చేసి కలం, కాగితం తెప్పించి దాని మీద ఏర్పాటు చేయండి అని వ్రాశారు. తరువాత తన దండకు కట్టియున్న తాయిత్తును, మెడలో వున్న బంగారపు తులసీ తావళాన్ని తీసి క్రింద పెట్టారు. వెంటనే కన్నుమూశారు. కన్న తండ్రి ప్రాణం పోతున్నప్పుడు కూడా నా భార్యపై కలిగిన మోహం నాకు మాయరాని మచ్చ తెచ్చింది, నాకు తల్లి, తండ్రి యెడగల భక్తి అపారం. వారికోసం నా సర్వస్వం ధారపోయగలను. కాని అందు యింకా కొరత వుందని ఈ ఘట్టం వల్ల తేలింది. ఏ సమయంలో నేను మేల్కొని వుండాలో ఆ సమయంలో నా మనస్సు భోగవాంఛలకు లోబడింది. అందువల్ల ఎన్నటికీ క్షమించరాని దోషం చేశాను. ఏకపత్నీవ్రతుణ్ణి అయినా కామాంధుణ్ణి అని భావించక తప్పదు. కామవాంఛను అదుపులో పెట్టడానికి చాలాకాలం పట్టింది. దాన్ని అదుపులో పెట్టుకునేలోపున అనేక గండాలు గడిచాయి.

రెండు కారణాల వల్ల నేను సిగ్గుపడవలసి వచ్చింది. ఈ ప్రకరణం ముగించే ముందు మరో విషయం వివరించడం అవసరం. తరువాత నా భార్య ప్రసవించింది. శిశువు మూడు నాలుగు రోజుల కంటె మించి బ్రతకలేదు. చేసిన తప్పుకు శిక్షపడినట్లే కదా! బాల్య దంపతులందరికి యిది ఒక హెచ్చరిక వంటిది. దాన్ని గమనించి బాల్యంలో పెండ్లి అయిన దంపతులు మేల్కొందురుగాక.