పుట:సత్యశోధన.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

పితృ నిర్యాణం - నావల్ల జరిగిన మహాపరాధం

సరిగ్గా ఆ రోజుల్లోనే మతండ్రిగారికి క్రమక్రమంగా వ్యాధి ఎక్కువ కాసాగింది. ఆయుర్వేద వైద్యుల పూతలు, హకీముల పట్టీలు, నాటు వైద్యుల ఔషధాలు అన్నీ పూర్తి అయ్యాయి. ఒక అలోపతీ డాక్టరు కూడా వచ్చి తన శక్తిని వినియోగించి చూచాడు. శస్త్ర చికిత్స తప్ప వేరే మార్గం లేదని డాక్టరు చెప్పివేశాడు. కాని అందుకు మా కుటుంబ వైద్యుడు అంగీకరించలేదు. మా వైద్యుడు సమర్థుడు, సుప్రసిద్ధుడు కూడా. అందువల్ల ఆయన మాట నెగ్గింది. శస్త్రచికిత్స జరుగలేదు. అందుకోసం కొన్న మందులన్నీ మూలబడ్డాయి. కుటుంబవైద్యుడు శస్త్రచికిత్సకు అంగీకరించియుంటే వ్రణం నయమైపోయేదని నా తలంపు. ఆ శస్త్రచికిత్స బొంబాయిలో ప్రసిద్ధుడైన ఒక గొప్ప డాక్టరు చేత చేయించాలని భావించాం. కాని ఈశ్వరేచ్ఛ అనుకూలం కాలేదు. మృత్యువు నెత్తిమీదకు వచ్చిపడినప్పుడు మంచి ఉపాయం ఎవ్వరికీ తోచదుకదా! తరువాత శస్త్రచికిత్స పరికరాలన్నింటిని వెంట పెట్టుకుని మా తండ్రిగారు బొంబాయి నుండి ఇంటికి వచ్చేశారు. ఆయనకు యిక జీవించననే విశ్వాసం కలిగింది. క్రమంగా ఆయన నీరసించిపోయారు. మంచంమీదనే అన్ని పనులు జరగవలసిన స్థితి ఏర్పడింది. కాని మా తండ్రిగారు అందుకు అంగీకరించలేదు. పట్టుపట్టి చివరివరకు ఏదో విధంగా లేచి అవతలకి వెళుతూ వుండేవారు. బహిర్శుద్ధి విషయంలో వైష్ణవ ధర్మంలో విధులు అంత కఠినంగా వుండేవి. అట్టి శుద్ధి అవసరమే, కాని రోగికి బాధ కలగకుండా, మంచం మీద మైలపడకుండ, పరిశుభ్రంగా నిత్యకృత్యాలు, మంచం మీదనే ఎలా జరపవచ్చునో పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు నేర్పింది. ఈ విధమైన పారిశుద్ధ్యాన్నే నేను వైష్ణవ ధర్మమని అంటాను. కాని రోగతీవ్రతలో సైతం మా తండ్రిగారు స్నానాదుల కోసం మంచం దిగవలసిందేనని పట్టుబట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. లోలోపల వారిని మెచ్చుకునేవాణ్ణి. ఒకనాడు ఆ కాళరాత్రి రానే వచ్చింది. మా పినతండ్రి రాజకోటలో వుండేవారు. మా తండ్రి అపాయస్థితిలో వున్నారని తెలిసి ఆయన రాజకోటకు వచ్చారని నాకు కొద్దిగా గుర్తు. వారిరువురి మధ్య సోదర ప్రేమ అధికంగా వుండేది. మా పినతండ్రి పగలంతా మా తండ్రిపడక దగ్గరే కూర్చుండి, రాత్రిపూట మమ్మల్నందరినీ నిద్రపొమ్మని పంపివేసేవాడు. తాను మా తండ్రి మంచం ప్రక్కనే పడుకునేవాడు. అది చివరిరాత్రి అని ఎవ్వరం ఊహించలేదు. అయితే ఎప్పుడూ భయం భయంగా వుండేది. ఆ రాత్రి 10.30 లేదా 11గంటలైంది. నేను మా తండ్రిగారి కాళ్ళు పిసుకుతూ వున్నాను. “నువు వెళ్ళు నేను కూర్చుంటాను” అని మా పినతండ్రి అన్నారు. ఆ మాటలు విని నేను సంతోషించాను. తిన్నగా పడకగదిలోకి వెళ్ళిపోయాను.