పుట:సత్యశోధన.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

437

ఉపన్యాసాల్లో మాత్రం యీ శబ్దాన్ని ప్రయోగిస్తూ వుండేవాణ్ణి. మహమ్మదీయుల సమావేశాల్లో మాత్రం శాంతియుతం అను శబ్దార్థాన్ని సరిగ వివరించి చెప్పలేకపోతూ వుండేవాణ్ణి. మౌలానా అబుల్‌కలాం ఆజాదును శాంతియుతంగా అనుదానికి ఉర్దూ శబ్దం చెప్పమని అడిగాను. ఆయన “బా అమన్” శబ్దం సూచించారు. సహాయనిరాకరణం అను శబ్దానికి “తరకే మవాలత్” అను శబ్దం సూచించారు. ఈ విధంగా గుజరాతీలోను, హిందీలోను, హిందుస్తానీలోను సహాయనిరాకరణాన్ని గురించిన భాష నా బుర్రలో నిర్మాణం కాసాగింది. కాంగ్రెస్‌లో సహాయనిరాకరణోద్యమాన్ని గురించి ప్రవేశపెట్టవలసిన తీర్మానం తయారు చేసి రైల్లోనే తీర్మానం షౌకత్ అలీకి యిచ్చివేశాను. అయితే అందు “శాంతియుతంగా” అను ముఖ్యమైన శబ్దం లేదని ఆ రాత్రి గ్రహించాను. వెంటనే మహాదేవను పరిగెత్తించి శాంతియుతంగా అను శబ్దాన్ని తీర్మానంలో చేర్చమని చెప్పించాను. ఈ శబ్దం చేర్చక పూర్వమే తీర్మానం అచ్చు అయిందని నా అభిప్రాయం. విషయనిర్ధారణ సభ ఆ రాత్రికే జరుగుతున్నది. ఆ సభలో అందరికీ చెప్పి ఆ శబ్దం చేర్చవలసి వచ్చింది. నేను జాగ్రత్తగా తీర్మానాన్ని సరిచేసి యుండకపోతే చాలా యిబ్బంది కలిగియుండేది. ఎవరు తీర్మానాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరు అనుకూలిస్తారో తెలియని స్థితిలో పడ్డాను. లాలాలజపతిరాయ్ గారి అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అనుభవజ్ఞులగు కార్యకర్తలు పెద్దసంఖ్యలో కలకత్తా సమావేశంలో పాల్గొన్నారు. విదుషీమణి ఎని బెసెంట్, పండిత మాలవ్యా, విజయరాఘవాచార్య, పండిత మోతీలాల్, దేశబంధు మొదలగు వారంతా అక్కడ వున్నారు. నా తీర్మానంలో ఖిలాఫత్ మరియు పంజాబులో జరిగిన దురంతాలకు సహకరించకూడదని పేర్కొన్నాను. శ్రీ విజయరాఘవాచార్యగారికి యీ విషయం రుచించలేదు. సహాయనిరాకరణం సాగించడానికి నిర్ణయించి అది ఫలానా అన్యాయమని కేసుని సీమితం ఎందుకు చేయాలి? స్వరాజ్యం లభించక పోవడం పెద్ద అన్యాయం కదా! దానికోసం సహాయనిరాకరణం అవసరం అని రాఘవాచార్యగారి వాదన. మోతీలాలుగారు కూడా తీర్మాన పరిధిని విస్తరింపచేయాలని భావించారు. నేను వెంటనే వారి సూచనను అంగీకరించాను. స్వరాజ్యం అని కూడా తీర్మానంలో చేర్చాను. విస్తారంగాను, గంభీరంగాను, తీవ్రంగాను చర్చలు సాగిన తదనంతరం సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఆమోదింపబడింది.

శ్రీ మోతీలాల్ గారు ఈ విషయమై శ్రద్ధ వహించారు. నాతో జరిగిన వారి తీయని సంభాషణ యిప్పుడు నాకు జ్ఞాపకం వున్నది. కొన్ని మాటలు అటు యిటు మార్చమన్నవారి