పుట:సత్యశోధన.pdf/461

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
438
నాగ్‌పూర్‌లో
 

సూచనను నేను అంగీకరించాను. దేశబంధును ఒప్పించే బాధ్యత వారు వహించారు. దేశబంధు హృదయం సహాయనిరాకరణోద్యమానికి అనుకూలమే, కాని ప్రజలు దాన్ని ఆచరణలో పెట్టలేరని ఆయన బుధ్ధికి తోచింది. దేశబంధు మరియు లాలాలజపతిరాయ్ గారలు పూర్తిగా నాగపూరులో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో లోకమాన్యుడు లేని లోటు నన్ను కలచివేసింది. వారు జీవించి యుంటే కలకత్తా నిర్ణయానికి తప్పక స్వాగతం చెప్పి యుండేవారని నా విశ్వాసం. అలా జరగక వారు వ్యతిరేకించినా నేను సంతోషించేవాణ్ణి. వారి దగ్గర నేను ఏదో కొంత నేర్చుకునేవాణ్ణి. వారితో నాకు అభిప్రాయభేదం వుండేది కాని అది తీయనిది. మా యిరువురి మధ్య మంచి సంబంధం వుండేది. దాన్ని వారు చెదరనీయలేదు. ఈ వాక్యలు వ్రాస్తున్నప్పుడు వారి చివరి గడియల దృశ్యం నా కండ్ల ముందు కనిపిస్తున్నది. అర్ధరాత్రి సమయంలో వారు తుదిశ్వాస విడిచే స్థితిలో వున్నారని ఫోనులో నా పరిచితులు శ్రీ పట్వర్దన్ తెలిపారు. “ఆయన నాకు పెద్ద అండ. అది కాస్తా వాడిపోయింది” అని ఆ క్షణంలో నా నోటినుండి వెలువడింది. దేశంలో సహాయ నిరాకరణోద్యమం తీవ్రంగా సాగుతున్నది. లోకమాన్యుని ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుందని ఆశించిన తరుణంలో వారు కన్నుమూశారు. ఉద్యమం సరియైన రూపం దాల్చినప్పుడు వారి అభిప్రాయం ఎలావుండేదో భగవంతుని కెరుక. భారతదేశ చరిత్ర బహుసున్నిత స్థాయిలో నడుస్తున్న యీ సమయంలో లోకమాన్యుడు లేకపోవడం నిజంగా తీరని లోటే. 

43. నాగ్‌పూర్‌లో

జాతీయ కాంగ్రెసు ప్రత్యేక సమావేశంలో అంగీకరించబడ్డ సహాయ నిరాకరణకు సంబంధించిన తీర్మానాన్ని నాగపూరులో జరుగనున్న వార్షిక మహాసభలో ఆమోదింపజేయాలి. కలకత్తాలో వలెనే నాగపూరులో కూడా అసంఖ్యాకంగా జనం వచ్చారు. ప్రతినిధుల సంఖ్య నిర్ధారణ కాలేదు. నాకు గుర్తు వున్నంతవరకు 14 వేలమంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. లాలాలజపతిరాయ్ గారు కోరిన ప్రకారం విద్యాలయాలకు సంబంధించిన తీర్మానంలో ఒక చిన్న మార్పుకు అంగీకరించాను. దేశబంధు కూడా కొద్ది మార్పుచేర్పులు చేయించారు. చివరికి శాంతియుత సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నియమావళికి సంబంధించిన తీర్మానం అంగీకరించాలి.