పుట:సత్యశోధన.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

436

సహాయ నిరాకరణోద్యమ తీవ్రత

వున్నది. కీ.శే. మౌలానా అబ్దుల్ బారీ మొదలుగా గల ముస్లిం పండితులతో యీ విషయమై చర్చలు జరిపాను. మహమ్మదీయులు ఎంతవరకు శాంతిని, అహింసను పాటించగలరా అని యోచించాము. ఒక స్థాయి వరకు వాటిని పాటించడం సులువేనని నిర్ణయానికి వచ్చాము. ఒక్కసారి అహింసా విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞచేస్తే చివరివరకు దానిమీద నిలబడాల్సిందే. అంతా సరేనని అన్న తరువాత సహాయ నిరాకరణోద్యమం సాగించాలని ఖిలాఫత్ కాన్ఫరెన్స్‌లో తీర్మానం అంగీకరించబడింది. అందు నిమిత్తం అలహాబాదులో రాత్రంతా సభ జరిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. హకీంఅజమల్ ఖాను గారిని శాంతియుతంగా ఉద్యమం సాగించాలా అని సందేహం పట్టుకుంది. సందేహనివృత్తి అయిన తరువాత ఆయన రంగంలోకి దిగాడు. ఆయన చేసిన సాయం అపారం. తరువాత గుజరాత్‌లో ప్రాంతీయ సభ జరిగింది. అందు నేను సహాయ నిరాకరణోద్యమ తీర్మానం ప్రవేశపెట్టాను. దాన్ని కొందరు వ్యతిరేకించారు. “జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమాన్ని అంగీకరించనంతవరకు ప్రాంతీయ పరిషత్తులకు అట్టి విధాన నిర్ణయాన్ని చేసేహక్కు లేదని వారు తెలిపిన మొదటి అడ్డంకి. అయితే నేను వారి వాదనను అంగీకరించలేదు. ప్రాంతీయ పరిషత్తులకు బాధ్యత లేదని చెప్పి వెనక్కి తగ్గడానికి వీలులేదు. ముందుకు అడుగు వేసే హక్కు అధికారం ప్రాంతీయ పరిషత్తులకు వున్నదని చెప్పాను. అంతేగాక ధైర్యం వుంటే తమ కర్తవ్యమని భావించి యీ విధంగా చేస్తే ప్రధాన సంస్థ యొక్క శోభ పెరుగుతుందని చెప్పాను. తీర్మానం యొక్క గుణదోషాలను గురించి కూడా మధురంగా చర్చ సాగింది. ఓట్లు తీసుకొని లెక్క పెట్టారు. అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి అబ్బాస్ తయబ్జీ మరియు వల్లభభాయి ఎంతో కృషి చేశారు. అబ్బాస్‌సాహబ్ ఆ సమావేశానికి అధ్యక్షులు. ఆయన సహాయనిరాకరణోద్యమానికి అనుకూలంగా మొగ్గు చూపారు. భారతీయ కాంగ్రెస్ యీ ప్రశ్నపై ఆలోచించుటకు ప్రత్యేక మహాసభను కలకత్తాలో సెప్టెంబరు 1920 నాడు ఏర్పాటు చేసింది. ఏర్పాట్లు పెద్ద స్థాయిలో జరిగాయి. లాలాలజపతిరాయ్ ఆ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఖిలాఫత్ స్పెషల్ మరియు కాంగ్రెస్ స్పెషల్ అను రెండు రైళ్లు బొంబాయి నుండి కలకత్తాకు బయలుదేరాయి. కలకత్తాకు ప్రతినిధులు, దర్శకులు పెద్దసంఖ్యలో చేరారు. మౌలానా షౌకత్ అలీ కోరిక మేరకు సహాయనిరాకరణాన్ని గురించిన తీర్మానం ముసాయిదా రైల్లో తయారు చేశాను. నా తీర్మానాలలో యిప్పటివరకు శాంతియుతంగా అను శబ్ద ప్రయోగం చేయలేదు.