పుట:సత్యశోధన.pdf/458

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
435
 

చేస్తున్నాను. ఆశీర్వదిస్తారు కదూ!” “అదెలా! మీరు క్రొత్త మిల్లులు తెరవగలిగితే ధన్యవాదాలు పొందుటకు పాత్రులు కాగలుగుతారు” “ఆపని నేను చేయడం లేదు. నేను రాట్నం పనిలో లీనమైవున్నాను.” “అదేమిటి? రాట్నం ఏమిటి” అని అడిగాడు. నేను రాట్నం గురించి వివరించి చెప్పి “మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను, నేను మిల్లులకు ఏజంటుగా పనిచేయకూడదు. అందువల్ల లాభానికి బదులు నష్టం చేకూరుతుంది. మిల్లుల్లో తయారైన సామగ్రి నిల్వఉండదు. నేను ఉత్పత్తి అయిన సామగ్రిని అమ్మకం చేసేందుకు పూనుకోవాలి. ఇప్పుడు నేను ఉత్పత్తి కార్యక్రమానికి పూనుకున్నాను. ఇటువంటి స్వదేశీ వస్తువులంటే నాకు శ్రద్ధ. ఇట్టి సామగ్రి ద్వారా ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టవచ్చు, సంవత్సరం పొడుగునా ఖాళీగా ఉండే స్త్రీలకు పని కల్పించవచ్చు. వాళ్ళు వడికిన నూలుతో బట్ట నేయించాలి. ఆ విధంగా తయారైన ఖద్దరును ప్రజలచేత ధరింపచేయాలి. ఇదే నా అభిలాష. ఇదే నా ఉద్యమం. రాట్నానికి సంబంధించిన ఈ ఉద్యమం ఎంతవరకు విజయం సాధిస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఆరంభదశలో వుంది. కాని నాకు దానిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఏది ఏమన్నాగానీ, నష్టం మాత్రం ఉండదు. హిందూ దేశంలో తయారయ్యే బట్ట ఎంత వృద్ధి అయితే ఈ ఉద్యమం వల్ల అంత లాభం చేకూరుతుంది. ఈ కృషిలో మీరు చెప్పిన దోషం లేదని అనుకుంటున్నాను” అని స్పష్టంగా చెప్పివేశాను.

“ఈ విధమైన ఉద్యమం మీరు సాగిస్తూ ఉంటే నేను చెప్పవలసింది ఇక ఏమీలేదు. ఈ యుగంలో రాట్నం నడుస్తుందా లేదా అనునది వేరు విషయం. నేను మాత్రం మీ కృషి సఫలం కావాలని కోరుతున్నాను.” అని సంభాషణను ముగించాడు ఆ పెద్దమనిషి. 

42. సహాయ నిరాకరణోద్యమ తీవ్రత

తరువాత ఖద్దరు అభివృద్ధి ఎలా జరిగిందో ఈ ప్రకరణంలో తెలపడం లేదు. ఆ వస్తువు ప్రజల ఎదుటకు ఎలా వచ్చిందో చెప్పిన తరువాత దాని చరిత్రలోకి దిగడం ఈ ప్రకరణాల లక్ష్యం కాదు. ఆవివరమంతా చెబితే పెద్ద గ్రంథం అవుతుంది. సత్యశోధన జరుపుతూ కొన్ని వస్తువులు ఒకటి తరువాత ఒకటిగా నా జీవితంలో సహజంగా ఎలా ప్రవేశించాయో తెలుపడమే నా ప్రధాన లక్ష్యం. ఇదే క్రమంలో యిక సహాయనిరాకరణోద్యమాన్ని గురించి తెలిపే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఆలీ సోదరులు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం ఒకవైపున తీవ్రంగా సాగుతూ