పుట:సత్యశోధన.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

368

అహింసాదేవి సాక్షాత్కారం

తిరుగుముఖం పట్టమని చెప్పివేశాడు. అనుచరులకు ఈ విషయమంతా చెప్పి ఇక వ్యవహారం తీవ్రరూపం దాలుస్తుంది. రైతుల పరిస్థితుల్ని పరీక్షించేందుకు ప్రభుత్వం నన్ను వెళ్ళనీయదు. నేను ఊహించినదాని కంటే ముందే నేను జైలుకు వెళ్లక తప్పదు. మోతీహారీలోగాని లేక అవకాశం దొరికితే బేతియాలోగాని నేను అరెస్టు కావడం మంచిది. నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి అని అన్నాను.

చంపారన్ తిరహత్ కమీషను యందలి ఒక జిల్లా. దానికి మోతీహారీ ప్రధాన కేంద్రం. బేతియాకు దగ్గరలో రాజకుమార్ శుక్లాగారి ఇల్లు వున్నది. అక్కడి కొఠార్లకు సంబంధించిన రైతులు కడు నిరుపేదలు. వారి పరిస్థితుల్ని చూపించాలని శుక్లాకు ఆరాటం ఎక్కువగా వున్నది. నేను అక్కడికి వెళ్లి వారిని చూడాలి అని భావించాను. వెంటనే అనుచరులందరినీ వెంటబెట్టుకొని మోతిహారీకి బయలుదేరాను. మోతిహారీలో గోరఖ్‌బాబు ఆశ్రయం, వారిల్లు సత్రంగా మారిపోయింది. మేము వారింటినంతటిని ఆక్రమించాం. మేము చేరిననాడే అక్కడికి దగ్గరలో అయిదు మైళ్ల దూరాన వున్న గ్రామంలో ఒక రైతు మీద దుర్మార్గం జరిగిందను వార్త మాకు అందింది. అతణ్ణి చూచేందుకు ధరణీధర బాబు అను వకీలును వెంటబెట్టుకొని నేను ఉదయాన వెళ్ళాలని నిర్ణయించాను. ఆ ప్రకారం ఏనుగు మీద ఎక్కి మేము ఆ గ్రామానికి బయలుదేరాం. గుజరాత్‌లో ఎడ్లబండిని ఉపయోగించిన విధంగా చంపారన్‌లో ఏనుగుల్ని ఉపయోగిస్తారు. సగం దూరం చేరామో లేదో ఇంతలో పోలీసు సూపరింటెండెంటు దూత అక్కడికి వచ్చి “సూపరింటెండెంట్ గారు మీకు సలాము చెప్పమన్నారు” అని అన్నాడు. వెంటనే విషయం గ్రహించాను. ధరణీధరబాబును ముందుకు వెళ్లమని చెప్పి వార్తాహరునితో బాటు అతను తెచ్చిన కిరాయి బండి ఎక్కాను. అతడు చంపారన్ వదలి వెళ్లిపొమ్మని నోటీసు నాకు యిచ్చి కాగితం చూపి సంతకం చేయమని అన్నాడు. “నేను చంపారన్ వదలి వెళ్ళను. నేను యిక్కడి పరిస్థితుల్ని పరీక్షించాల్సి వున్నది” అని సమాధానం వ్రాసి అతనికి యిచ్చాను. మరుసటి రోజున చంపారన్ వదలి వెళ్ళనందువల్ల కోర్టులో హాజరుకమ్మని సమను నాకు అందింది. ఆ రాత్రంతా మేలుకొని నేను వ్రాయవలసిన జాబులన్నీ వ్రాశాను. అవసరమైన సూచనలన్నీ వ్రాసి ప్రజకిషోర్‌బాబుకు యిచ్చాను.

కోర్టువాళ్లు సమను పంపారను వార్త క్షణంలో జనానికి తెలిసిపోయింది. మోతిహారీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘట్టం జరిగిందని ప్రజలు గోల పెట్టారు. గోరఖ్‌బాబుగారి యింటిదగ్గర, కోర్టు దగ్గర గుంపులు గుంపులుగా జనం చేరారు.