పుట:సత్యశోధన.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

369

అదృష్టవశాత్తూ ఆ రాత్రే పనులన్నీ పూర్తిచేయడం వల్ల ఆ జనాన్ని శాంతింపచేసేందుకు నాకు అవకాశం చిక్కింది. నా అనుచరుల వల్ల కలిగే ఉపయోగమేమిటో నాకు బోధపడింది. వాళ్లు జనాన్ని వరసగా నిలబెట్టడం ప్రారంభించారు. కోర్టులో ఎక్కడికి వెళితే అక్కడ నా వెంట ఒకటే జనం. కలెక్టరు, మేజిస్ట్రేట్, సూపరింటెండెంటుతో కూడా నాకు సంబంధం ఏర్పడింది. గవర్నమెంటువారి నోటీసుల్ని ఒప్పుకున్నాను. అధికారులతో ఎంతో మంచిగా వ్యవహరించాను. దానితో వారందరికీ నా విషయమై భయం పోయింది. వారిని మంచిగానే వ్యతిరేకిస్తానని వాళ్లకు బోధపడింది. నన్ను అదుపులో పెట్టడానికి బదులు జనాన్ని అదుపులో పెట్టడానికీ నా అనుచరులకు సంతోషంతో వాళ్లు సహకరించడం ప్రారంభించారు. దానితోబాటు తమ అధికార ప్రాబల్యం ఆనాటితో తగ్గిపోయిందని వాళ్లు గ్రహించారు. ప్రజలు ఆ క్షణం గవర్నమెంటు అధికారుల దండన, శిక్షల భయం మరచిపోయి తను క్రొత్త మిత్రుని యెడ గల ప్రేమ యొక్క ఆధిపత్యానికి లోబడిపోయారని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

నిజానికి చంపారన్‌లో నన్ను ఎవ్వరూ ఎరుగరు. రైతులు నిరక్షరకుక్షులు. చంపారన్ గంగానదికి ఆవలి ఒడ్డున హిమాలయ పర్వత చరియల్లో నేపాలుకు దగ్గరగా వున్న ప్రాంతం. అంటే అదీ ఒక క్రొత్త ప్రపంచమన్నమాట. అక్కడ కాంగ్రెస్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్ మెంబరు ఒక్కడు కూడా అక్కడ లేడు. కొందరి పేర్లు వినపడ్డా వారు భయంతో నక్కి కూర్చున్నారు. కాంగ్రెస్ పేరు తెలియకపోయినా యీనాడు కాంగ్రెస్ జరిగినంతపని అయింది. అనేకమంది సేవకులు కాంగ్రెసులో చేరినట్లయింది. అక్కడ కాంగ్రెస్ ప్రారంభమైందని అనిపించింది. అనుచరులతో సంప్రదించిన పిమ్మట కాంగ్రెస్ పేరట ఏ పనీ చేయకూడదని నిర్ణయించాం. పేరుతో అవసరం లేదు. పని ముఖ్యం అని భావించాం. మాటలు కాదు చేతలు ముఖ్యం అని నిర్ణయించాం. కాంగ్రెస్ పేరు ఎవ్వరికీ ఇష్టం కాలేదు. యీ పరగణాలో కాంగ్రెసంటే ప్లీడర్ల వాద ప్రతివాదాలు, చట్ట సంబంధమైన ఛిద్రాలతో తలపడటం అనే ప్రచారం అయింది. కాంగ్రెస్ అంటే బాంబులనీ, మాటలే కాని చేతలు లేనిదని యిక్కడి గవర్నమెంటు, మరియు దానికి దన్నుగా నిలబడియున్న తెల్లదొరల అభిప్రాయం. అట్టి కాంగ్రెస్‌కు, యిక్కడి కాంగ్రెస్‌కు తేడా వున్నదని మేము రుజువు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల కాంగ్రెస్ ఊసే ఎత్తకుండా పనిచేయాలని భావించాం. కాంగ్రెస్ పేరుతో గాక, దాని లక్ష్యాలను ప్రజలు తెలుసుకుంటే చాలునను నిర్ణయానికి వచ్చాం.