పుట:సత్యశోధన.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

367

వల్ల ప్రయోజనం శూన్యం. అణగారిపోయి భయభ్రాంతులై వున్న రైతు సోదరుల్ని కచ్చేరీల చుట్టూ త్రిప్పితే లాభం లేదు. అది సరియైన చికిత్స కాదు. వాళ్లకుగల భయాన్ని పోగొట్టాలి. అదే సరియైన చికిత్స. తిన్‌కఠియా రివాజు రద్దుకావాలి. అప్పటివరకు మనం విశ్రమించకూడదు. రెండు రోజుల్లో సాధ్యమైనంతగా చూచి తెలుసుకుందామని వచ్చాను. అయితే యీ పనికి రెండు సంవత్సరాలు పట్టవచ్చని తోస్తున్నది. అంత సమయం యివ్వడానికి సిద్ధంగా వున్నాను. యిందుకు ఏంచేయాలో నిర్ణయిస్తాను. కాని మీ సాయం కావాలి” అని స్పష్టంగా చెప్పాను.

ప్రజ కిషోర్ బాబు అసలు విషయం అర్ధం చేసుకున్నారు. అయితే నాతోను మిగతా వారితోను తర్కం చేయసాగారు. నామాటల్లో గర్భితమైయున్న భావాన్ని గురించి ప్రశ్నించాను. మీ అభిప్రాయంలో వకీళ్లు చేయాల్సిన త్యాగం ఏమిటి? ఎంతవరకు? ఎంతమంది వకీళ్లు కావాలి? కొద్దిమంది కొద్దికాలం పనిచేస్తే సరిపోతుందా లేదా? మొదలగు ప్రశ్నలు వేశారు. మీరంతా ఎంత త్యాగం చేస్తారో చెప్పండి అని ఆయన మిగతా వకీళ్లను అడిగారు. ఈ విధమైన చర్చ సాగించి చివరికి “మేము యింత మందిమి మీరు అప్పగించిన పని చేయడానికి సిద్ధంగా వుంటాము. వారిలో ఎవరిని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ దగ్గరకు వస్తాము. జైలుకు వెళ్లాలంటే మరి అది మాకు క్రొత్త. అందుకు అవసరమైన శక్తి చేకూర్చుకునేందుకు ప్రయత్నిస్తాం” అని తమ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. 

14. అహింసాదేవి సాక్షాత్కారం

నేను రైతుల పరిస్థితిని పరీక్షించాలి. నీలిమందు కొఠార్ల యజమానులగు తెల్లదొరలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్లో ఎంత నిజం వున్నదో తెలుసుకోవాలి. యీ విషయమై వేలాది రైతుల్ని కలవాలి. వారిని కలుసుకునే ముందు నీలిమందు కొఠారుల యజమానుల్ని కలిసి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. కమీషనరుకు జాబులు వ్రాశాను. యజమానుల సంఘ కార్యదర్శి ఒకడు వున్నాడు. వెళ్లి కలిశాను. “నీవు పరదేశివి. మాకు, రైతులకు మధ్య నీవు కల్పించుకోవద్దు. ఏమైనా చెప్పదలచుకుంటే లిఖితంగా వ్రాసి పంపు” అని ఆయన అన్నాడు. ఆయన మాటకు వినమ్రంగా జవాబిస్తూ “నేను పరదేశిని కాను. రైతులు కోరినందువల్ల వారి యీ వ్యవహారం క్షుణ్ణంగా తెలుసుకొనే అధికారం నాకు వున్నది.” అని చెప్పాను. కమీషనరును కలిశాను. ఆయన నన్ను చూడగానే మండిపడ్డాడు. బెదిరించాడు. తిరహుత్ నుండి