పుట:సత్యశోధన.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

361

నచ్చింది. లల్లూభాయికి కూడా నా తర్కం నచ్చింది. జూలై 31వ తేదీ వరకు గడువు యిస్తూ బహిరంగసభలో తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరించబడింది. శ్రీజయజీ పేటిట్ గారి కృషివల్ల బొంబాయి నుండి కొందరు మహిళలు వెళ్లి వైస్రాయిని కలుసుకున్నారు. వారిలో లేడీ తాతా, కీ.శే దిల్‌ఫాద్ బేగం మొదలగు మహిళలు వున్నారు. యింకా ఎవరెవరు వున్నారో నాకు గుర్తులేదు. కాని యీ రాయబారం వల్ల సత్ఫలితం కలిగింది. వైస్రాయి ఉత్సాహవర్ధకమైన సమాధానం యిచ్చాడు. నేను కరాచీ, కలకత్తా మొదలగు స్థలాలకు కూడా వెళ్లి వచ్చాను. అన్ని చోట్ల సభలు జరిగాయి. ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పర్యటనకు పూనుకొనే ముందు సభల్లో యింత అధిక సంఖ్యలో జనం పాల్గొంటారని నేను ఊహించలేదు.

అప్పుడు నేనొక్కడినే ప్రయాణం చేస్తూ వుండేవాణ్ణి. అందువల్ల ఊహించని అనుభవాలు కలుగుతూ వుండేవి. గూఢచారులు నావెంట వుండేవారు. వారితో జగడానికి అవకాశం లేదు. నేను ఏమీ దాచేవాణ్ణి కాదు. అందువల్ల వాళ్లు నన్ను బాధించేవారు కాదు. నేను వారిని బాధించేవాణ్ణి కాను. అదృష్టవశాత్తు అప్పటికి నాకు యింకా మహాత్మ అను బిరుదు లభించలేదు. నన్ను గుర్తించిన చోట మాత్రం జనం యీ బిరుదును ఉపయోగించి నినాదాలు చేస్తూ వుండేవారు. ఒక సారి రైల్లో వెళుతున్నప్పుడు గూఢచారులు నా దగ్గరకి వచ్చి టిక్కెట్టు అడిగి తీసికొని నెంబరు నోట్ చేసుకోసాగారు. వారడిగిన ప్రశ్నలకు నేను వెంటనే సమాధానం యిచ్చాను. నేనేదో అమాయకుడైన సాధువునని తోటి ప్రయాణీకులు భావించారు. రెండు మూడు స్టేషన్ల వరకు వరుసగా గూఢచారి పోలీసులు రావడం, నన్నేవేవో ప్రశ్నలు అడగడం చూచి తోటి ప్రయాణీకులకు కోపం వచ్చి వాళ్లను బెదిరించి “ఎందుకయ్యా అమాయకుడైన యీ సాధుపుంగవుణ్ణి బాధపెతడారు వెళ్లండి” అని అరవడం ప్రారంభించారు, “ఇదుగో! యిక టిక్కెట్టు చూపించకండి చూద్దాం ఏం చేస్తారో!” అని నాతో అన్నారు.

“వాళ్లు చూస్తే నష్టం ఏముంది? వాళ్లు తమ కర్తవ్యాన్ని పాలిస్తున్నారు. నాకేమీ బాధ కలగడం లేదు” అని చెప్పాను. యాత్రీకులకు నా యెడ సానుభూతి పెరిగి పాపం, నిరపరాధుల్ని యింతగా బాధిస్తారేమిటి? అని తమలో తాము అనుకున్నారు. గూఢచారులగు పోలీసుల వల్ల నాకేమీ బాధ కలుగలేదు, కాని లాహోరు ఢిల్లీల మధ్య రైల్లో ప్రయాణించినప్పుడు జనం గుంపులు గుంపులుగా విరుచుకుపడ్డప్పుడు నాకు చాలా యిబ్బంది కలిగింది. కరాచీ నుండి కలకత్తాకు లాహోరు మీదుగా వెళ్లాలి. లాహోరులో రైలు మారాలి. అక్కడి రైల్లో నా పప్పులేమీ ఉడకలేదు. యాత్రీకులు