పుట:సత్యశోధన.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

360

గిరిమిట్ ప్రధ

చాలామంది నాయకుల్ని ప్రముఖుల్ని కలిశాను. ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా వున్నదని గ్రహించాను. యీ విషయంలో సత్యాగ్రహాన్ని ఉపయోగించవచ్చని భావించాను. కాని ఎలా ఎప్పుడు అను విషయమై నేను యింకా నిర్ణయానికి రాలేదు. “సమయం వచ్చినప్పుడు” అంటే ఏమిటో చెప్పడానికి వైస్రాయి ప్రయత్నించి “మరో వ్యవస్థ చేయుటకు ఎంత సమయం పడుతుందో అంతవరకు” అని అన్నాడు. ఫిబ్రవరి 1917లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యా గిర్మిట్ ప్రధను వెంటనే రద్దు చేయాలని బిల్లు కౌన్సిలులో ప్రవేశపెట్టగా వైస్రాయి అందుకు అంగీకరించలేదు. దానితో యీ సమస్యపై నేను దేశమందంతట ప్రచారం చేసేందుకై పర్యటన ప్రారంభించాను. పర్యటన ప్రారంభించే పూర్వం వైస్రాయిని కలవడం మంచిదని భావించాను. ఆయన వెంటనే తనను కలుసుకునేందుకు తేదీ నిర్ణయించాడు. అప్పుడు మి.మేఫీ (యిప్పుడు సర్‌జాన్ మేఫీ) వైస్రాయికి సెక్రటరీగా వున్నాడు. ఆయనతో నాకు మంచి సంబంధం ఏర్పడింది. లార్డ్ చేమ్స్‌ఫర్డుతో కూడా మాట్లాడాను. నిశ్చింతగా ఏమీ చెప్పకపోయినా తప్పక నిర్ణయం గైకొంటానని తాను సహకరిస్తానని చెప్పి అతడు ఆశ కల్పించాడు.

నేను బొంబాయి నుండి నా పర్యటన ప్రారంభించాను. బొంబాయిలో సభ ఏర్పాటుచేసే బాధ్యత బిష్టర్ జహంగీర్ పేటీట్ వహించారు. ఇంపీరియల్ సిటిజన్‌షిప్ అసోసియేషస్ ఆధ్వర్యాన సభ జరిగింది. అందు ప్రవేశ పెట్టవలసిన తీర్మానం తయారుచేసేందుకు ఒక కమిటీ ఏర్పడింది. అందు డా. రీడ్ సర్ లల్లూభాయి శ్యామల్ దాస్, మి. నటరాజన్ మొదలగువారు వున్నారు. మి. పేటిట్ అందు ప్రముఖులు. వెంటనే గిర్‌మిట్ ప్రథను రద్దుచేయమని ప్రభుత్వాన్ని తీర్మానంలో కోరారు. ఎప్పుడు రద్దుచేయాలి అన్నదే ముఖ్యమైన సమస్య. (1) రద్దు బహు త్వరగా జరగాలి. (2) జులై 31వ తేదీనాటికి రద్దు జరగాలి (3) వెంటనే రద్దు జరగాలి అని మూడు సూచనలు వచ్చాయి. జూలై 31వ తేదీనాటికీ రద్దు కావాలన్న సూచన నేను చేశాను. నేను తేదీ నిర్ణయించబడాలని కోరాను. అలా తీర్మానిస్తే ఆ తేదీనాటికి రద్దు చేయకపోతే ఏం చేయాలో నిర్ణయించవచ్చునని నా ఉద్దేశ్యం. కాని లల్లూభాయి తక్షణం రద్దుచేయాలని అభిప్రాయపడ్డారు. తక్షణం అంటే జనానికి అర్థం కాదని ప్రజల ద్వారా పని చేయించాలంటే నిశ్చితంగా తేదీవాళ్ల ముందు వుంచడం అవసరమని తక్షణం అంటే ప్రతివారు తమ యిష్టప్రకారం అంచనా వేస్తారని అందువల్ల జూలై 31వ తేదీ వరకు గడువు యిద్దామని నచ్చచెప్పాను. నా తర్కం రీడ్‌కు