పుట:సత్యశోధన.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

362

గిరిమిట్ ప్రధ

బలవంతంగా లోపలికి దూరుతున్నాడు. నేను నిశ్చిత సమయానికి కలకత్తా చేరాలి. ఆ ట్రైను అందకపోతే కలకత్తా సమయానికి చేరలేను. చోటు దొరుకుతుందనే ఆశ పోయింది. నన్ను తమ పెట్టెలో ఎవ్వరూ ఎక్కనీయలేదు. ఒక్క కూలీ నన్ను చూచి 12 అణాలు యిస్తే చోటు చూపిస్తానని అన్నాడు. చోటు చూపించు, 12 అణాలు తప్పక యిస్తాను అని అన్నాను. పాపం ఆ కూలీ ప్రయాణీకుల్ని బ్రతిమిలాడినా ఒక్కరు కూడా వినిపించుకోలేదు. బండి కదలబోతుండగా కొందరు యాత్రికులు లోపల చోటు లేదు కాని, జొరబడేలా చేయగలిగితే ఎక్కించు అని అన్నారు. కూలీ ఏమండీ ఎక్కుతారా అని అడిగాడు. ఆ అన్నాను. వెంటనే కూలీ నన్ను ఎత్తి కిటికీలో నుండి లోనికి వేశాడు. నేను లోపల పడ్డాను. కూలీ 12 అణాలు సంపాదించాడు. ఆ రాత్రి అతి కష్టంగా గడిచింది. మిగతా యాత్రికులు ఏదో విధంగా చోటు చేసుకొని కూర్చున్నారు. నేను పై బెంచి గొలుసు పట్టుకొని రెండు గంటలపాటు నిలబడే వున్నాను. ఈలోపున కూర్చోవేమయ్యా అని కొందరు గద్దించి అడగసాగారు. చోటు వుంటే కదా కూర్చోవడానికి అని నేను అన్నాను. వాళ్లకు నేను నుంచోవడం కూడా యిష్టం లేదు. పైగా వాళ్లు బెంచీల మీద హాయిగా పడుకున్నారు. తప్పుకోమని నన్ను మాటిమాటికి సతాయిస్తూ వున్నారు. వారు బాధించినప్పుడు నేను ప్రశాంతంగా వుండేసరికి నీ పేరేమిటి అని నన్ను అడిగారు. నేను పేరు చెప్పవలసి వచ్చింది. పేరు వినగానే వాళ్లు సిగ్గుపడ్డారు. క్షమించమని అని తమ ప్రక్కన చోటు యిచ్చి కూర్చోబెట్టారు. కష్టే ఫలే అను సూక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పటికి అలసిపోయాను. తల తిరుగుతూ వుంది. కూర్చోవలసిన అవసరం కలిగినప్పుడు దేవుడు వెంటనే చోటు చూపించాడన్నమాట.

ఈ విధంగా నానాయాతన పడి సమయానికి కలకత్తా చేరాను. అక్కడ కౌసిన్ బజారు మహారాజా తన దగ్గర వుండమని ఆహ్వానించాడు. ఆయనే కలకత్తా సభకు అధ్యక్షుడు. కరాచీ వలెనే కలకత్తాలో కూడా జనం ఉత్సాహంతో సభలో పాల్గొన్నారు. కొద్దిమంది ఆంగ్లేయులు కూడా సభలో పాల్గొన్నారు. జూలై 31వ తేదీ లోపునే గిర్‌మిట్ ప్రథను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. 1895లో మొట్టమొదటి దరఖాస్తు ఈ విధానాన్ని రద్దు చేయమని వ్రాసి పంపాను. అప్పుడు ఏదో రోజున ఈ అర్ధ బానిసత్వం తొలగిపోతుందని నమ్మాను. అయితే దీని వెనుక పరిశుద్ధమైన సత్యాగ్రహ ప్రవృత్తి పనిచేసిందని చెప్పక తప్పదు.

దీన్ని గురిచిన పూర్తి వివరం. అందు పాల్గొన్న వారి పేర్లు తెలుసుకోవాలను కొన్నవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను నా గ్రంథం చదువవచ్చు.