పుట:సత్యశోధన.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

చిన్న సత్యాగ్రహం

చాలా వ్యత్యాసం చూపబడుతున్నది. దీన్ని సహించడం కష్టం. ఈ వ్యవహారం త్వరగా తేల్చుకోవడం మంచిది. లేకపోతే మనం యిబ్బందుల్లో పడతాం. మనవాళ్లెవరు కూడా అర్ధం పర్ధం లేని హకుములను పాటించేస్థితిలో లేరు. ఆత్మాభిమాన రక్షణ కోసం ప్రారంభించిన పనిలో అవమానాలు కావడం సరికాదు.” అని అన్నాడు.

నేను ఆఫీసరు దగ్గరకు వెళ్ళాను. విషయాలన్నీ ఆయనకు చెప్పివేశాను. ఒక పత్రంలో వాటన్నింటిని వ్రాసి యిమ్మని అంటూ తన అధికారాన్ని గురించి కూడా చెపుతూ “మీద్వారా యిట్టి ఆరోపణలు రాకూడదు. డిప్యూటీ ఆఫీసరుద్వారా తిన్నగా నాదగ్గరకు రావాలి” అని అన్నాడు. “నాకు అధికారాలేమీ అక్కరలేదు. సైనికరీత్యా నేను సామాన్య సిపాయిని మాత్రమే. కాని మాట్రూపునాయకుని హోదాలో మీరు నన్ను వారి ప్రతినిధిగా అంగీకరించక తప్పదు. నాకు అందిన ఆరోపణలు చెప్పాను. అదీకాక ఉపనాయకుల నియామకం మమ్మల్ని అడిగి చేయలేదు. వాళ్ళ విషయమై అంతా అసంతృప్తిగా వున్నారు. అందువల్ల వాళ్లను వెంటనే తొలగించివేయండి. ట్రూపు మెంబర్లకు తమ నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం యివ్వండి.” అని స్పష్టంగా చెప్పివేశాను. నా మాటలు అతనికి మింగుడు పడలేదు. అసలు ఉపనాయకుణ్ణి ఎన్నుకొనే ప్రశ్న లేదు, ఇప్పుడు వాళ్ళను తొలగించితే ఆజ్ఞాపాలనను సైనిక నియమాలకు తావే వుండదు అని అన్నాడు. మేము సభ జరిపాం. చిన్న సత్యాగ్రహానికి పూనుకోవాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటినాయకుల్ని తొలగించక పోతే, క్రొత్త నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం ట్రూపు మెంబర్లకు యివ్వకపోతే మా ట్రూపు కవాతులో పాల్గొనదు, క్యాంపుకు వెళ్ళడం మానివేస్తుంది. అంటూ తీర్మానం చేశాం.

నేను ఆఫీసరుకు మా అసంతృప్తిని వెల్లడిస్తూ జాబు వ్రాశాను. నాకు అధికారం ఏమీ వద్దు. సేవ చేయడానికి వచ్చాం. ఆపని పూర్తి చేయాలి. బోయర్ల సంగ్రామంలో నేను ఎట్టి అధికారం పొందలేదు. అయినా కర్నల్ గేలబ్‌కు మా ట్రూపుకు మధ్య ఎన్నడు ఏ విధమైన పొరపొచ్చము ఏర్పడలేదు. నా ద్వారా మా ట్రూపు అభిప్రాయాలు తెలుసుకొని ఆయన వ్యవహరించేవాడు. అని పత్రంలో వ్రాసి తీర్మానం ప్రతి కూడా దానితోపాటు పంపించాను. అయితే ఆఫీసరు నా పత్రాన్ని ఖాతరు చేయలేరు. మేము మీటింగు జరిపి తీర్మానం ప్యాసు చేయడం కూడా మిలటరీ నియమాలకు వ్యతిరేకమనే నిర్ధారణకు వచ్చాడు. తరువాత నేను భారతమంత్రికి ఈ వ్యవహారమంతా తెలియజేస్తూ జాబు పంపాను. తీర్మానం ప్రతి కూడా దానితో జత చేశాను. భారత మంత్రి వెంటనే సమాధానం వ్రాస్తూ ట్రూపుకు నాయకుని ఉపనాయకుని ఎన్నుకునే అధికారం