పుట:సత్యశోధన.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

323

వున్నది. భవిష్యత్తులో ఆ నాయకుడు మీ సిఫారసులను పాటిస్తాడు అని జాబు పంపాడు. ఆ తరువాత మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా జరిగాయి. ఆచేదు అనుభవాలన్నింటినీ పేర్కొని ఈ ప్రకరణాన్ని పెంచ దలుచుకోలేదు. అయితే హిందూ దేశంలో ప్రతిరోజు మనకు కలుగుతూ వుండే కటు అనుభవాలవంటివే అవి అని చెప్పక తప్పదు.

ఆఫీసరు బెదిరించి మాలో మాకు వైరుధ్యం వచ్చేలా చేశాడు. ప్రతిజ్ఞ చేసిన మాలో కొందరు సామదండభేదాలకు లోబడిపోయారు. ఇంతలో నేటలీ ఆసుపత్రికి అసంఖ్యాకంగా గాయపడ్డ సైనికులు వచ్చారు. వారికి సేవ చేసేందుకు మా ట్రూపు మెంబర్లమంతా అవసరమైనాము. మా వాళ్ళు కొంతమంది నేటలీ వెళ్ళారు. కాని మిగతావాళ్ళు వెళ్ళలేదు. ఇండియా ఆఫీసువారికి ఇలా వెళ్ళకపోవడం నచ్చలేదు. నేను మంచం పట్టినప్పటికి మెంబర్లను కలుసుకుంటూనే వున్నాను. మి.రాబర్ట్సు తో బాగా పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను కలుసుకునేందుకు వచ్చి మిగతా వారిని కూడా పంపమని పట్టుబట్టాడు. వాళ్ళంతా వేరే ట్రూపుగా వెళ్ళవచ్చని, అయితే నేటలీ ఆసుపత్రిలో అక్కడి నాయకుని ఆధీనంలో వుండి ఈ ట్రూపు సభ్యులు పనిచేయాలని, అందువల్ల పరువు నష్టం జరగదని ప్రభుత్వం ఎంతో సంతోషిస్తుందని, గాయపడ్డ సైనికులకు సేవాశుశ్రూషలు లభిస్తాయని మరీ మరీ చెప్పాడు.

నాకు, నా అనుచరులకు వారి సలహా నచ్చింది. దానితో మిగతా వారు కూడా నేటలీ వెళ్ళారు. నేను ఒక్కణ్ణి మాత్రం చేతులు నలుపుకుంటూ పక్కమీదపడి ఆగిపోయాను. 

41. గోఖలేగారి ఔదార్యం

ఇంగ్లాండులో నరం వాపును గురించి వ్రాశాను. నన్ను యీ జబ్బు పట్టుకున్నప్పుడు గోఖలేగారు ఇంగ్లాండు వచ్చారు. వారి దగ్గరికి నేను, కేలన్‌బెక్ తరుచు వెళుతూ వున్నాం. ఎక్కువగా యుద్ధాన్ని గురించిన చర్చ జరుగుతూ వుండేది. జర్మనీ భూగోళం కేలన్‌బెక్‌కు కరతలామలకం. ఆయన యూరపంతా పర్యటించిన వ్యక్తి. అందువల్ల మ్యాపువేసి యుద్ధస్థావరాలను గోఖలేగారికి చూపుతూ వుండేవాడు. నా జబ్బు కూడా చర్చనీయాంశం అయింది. ఆహారాన్ని గురించిన నా ప్రయోగాలు సాగుతూనే వున్నాయి. ఆ సమయంలో వేరుశెనగపప్పు, పచ్చి మరియు పండిన అరటిపండ్లు, టమోటాలు, ద్రాక్షపండ్లు మొదలగు వాటిని భుజిస్తున్నాను. పాలు, ధాన్యం పప్పు పూర్తిగా మానివేశాను.