పుట:సత్యశోధన.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

319

వుంటుంది. అయినా దేహధారి ఎవ్వడూ కూడా బాహ్యహింస నుండి పూర్తిగా విముక్తి పొందజాలడు.

అహింసలో అద్వైత భావం నిండి వుంటుంది. ప్రాణులన్నింటిలో భేదం లేనప్పుడు ఒకదాని పాపప్రభావం మరొకదానిమీద తప్పక పడుతుంది. అందువల్ల మనిషి హింసనుండి తప్పించుకోలేడు. సమాజంలో నివసించేవ్యక్తి సమాజంలో సాగే హింసలో యిష్టం లేకపోయినా భాగస్వామి కాక తప్పదు. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యుద్ధాన్ని ఆపడం అహింసా వాదుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించలేకపోయినపుడు, యుద్ధాన్ని వ్యతిరేకించగల శక్తి లేనప్పుడు, అట్టి హక్కు కూడా కలిగివుండనప్పుడు వ్యక్తి యుద్ధకార్యాల్లో చేరిపోవాలి. చేరినప్పటికీ తనను, తన దేశాన్ని, జగత్తును రక్షించేందుకు హృదయపూర్తిగా కృషిచేయాలి.

నేను ఆంగ్ల రాజ్యం ద్వారా నా దేశ ప్రజల స్థితిని సరిదిద్దవలెనని భావించాను. నేను ఇంగ్లాండులో కూర్చొని బ్రిటీష్ యుద్ధ ఓడల ద్వారా రక్షణ పొందివున్నాను. అంటే ఆ బలాన్ని యీ విధంగా ఉపయోగించుకొని, అందు నిహితమైయున్న హింసలో తిన్నగా నేను పాల్గొంటూ వున్నానన్నమాట. ఈ ప్రభుత్వంతో సంబంధం పెట్టుకొని వ్యవహారాలు జరపాలన్నా, ప్రభుత్వ పతాక క్రింద వుండాలన్నా, నేను రెండు మార్గాలలో ఏదో ఒక దాన్ని అనుసరించాలి. యుద్ధాన్ని బాహాటంగా వ్యతిరేకించాలి. ఆ ప్రభుత్వ విధానం యుద్ధానికి వ్యతిరేకంగా మారనంతవరుకు సత్యాగ్రహశాస్త్ర ప్రకారం దాన్ని బహిష్కరించాలి లేక ఆ ప్రభుత్వ చట్టాలను ధిక్కరించి జైలుకు వెళ్ళాలి. అలా చేయలేనప్పుడు యుద్ధకార్యాలలో పాల్గొని ఆ ప్రభుత్వానికి సహకరించి, అవసరమైనప్పుడు దాన్ని ధిక్కరించగల శక్తిని, హక్కును సమకూర్చుకోవాలి. అట్టి శక్తి యిప్పుడు నాకు లేదు. అందువల్ల యుద్ధంలో చేరి సహకరించాలనే నిర్ణయానికి వచ్చాను.

అయితే తుపాకి పట్టుకొన్న వాడికి, వాడికి సహకరించేవారికి మధ్య హింసదృష్ట్యా తేడా లేదని నాకు తెలుసు. దోపిడీ దొంగలకు అవసరమైన సేవ చేయటానికి, అతడి మాటలు మోయడానికి, గాయపడినప్పుడు అతడికి సేవాశుశ్రూషలు చేయడానికి సిద్ధపడిన మనిషి కూడా దోపిడి వ్యవహారంలో దొంగతో సమానంగా బాధ్యత వహించవలసిందే. ఈ దృష్టితో పరిశీలిస్తే సైన్యంలో చేరి గాయపడ్డ సైనికులకు సేవా శుశ్రూషలు చేసేవాడు కూడా యుద్ధానికి సంబంధించిన దోషాన్నుండి తప్పించుకోలేడు.