పుట:సత్యశోధన.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

నా భార్య యొక్క దృఢచిత్తత

అప్పుడు నా వెంట మా ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. వాణ్ణి అడిగాను ‘మీ మాటే నా దృష్టిలో సరైనది. అమ్మను అడిగితే ఆమె మాంసం తినడానికి ఒప్పుకోదు’ అని మా అబ్బాయి అన్నాడు. నేను కస్తూరిబాయి దగ్గరికి వెళ్ళాను. ఆమె చాలా బలహీనంగా ఉన్నది. ఆమెను మాట్లాడించడానికి మనస్సు ఇష్టపడలేదు. అయినా ధర్మమని భావించి ఆమెకు విషయమంతా క్లుప్తంగా చెప్పాను. ఆమె దృఢనిశ్చయంతో ఇలా అన్నది “నేను ఏది ఏమైనా సరే మాంసం కలిపిన చారు పుచ్చుకోను. మానవజన్మ దుర్లభం. అది మాటిమాటికి లభించదు. అయినా మీ ఒళ్ళోచనిపోవడానికి ఇష్టపడతాను. కాని ఈ దేహాన్ని భ్రష్టం కానీయను” అని అన్నది. ఎన్నో విధాల ఆమెకు నచ్చచెప్పి చూచాను. “నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలని నీకు నిర్బంధం లేదు. మనకు తెలిసిన ఫలానా హిందువులు మాంసం, మద్యం పుచ్చుకున్నారు అని కూడా చెప్పాను. కాని ఆమె మాత్రం సరే అని అనలేదు. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి” అని అన్నది.

ఆమె మాటలునాకు సంతోషం కలిగించాయి. ఆమెను తీసుకు వెళ్ళడానికి భయం వేసింది. కాని గట్టి నిర్ణయానికి వచ్చి కస్తూరిబా అభిప్రాయం డాక్టరుకు చెప్పివేశాను. ఆయన మండిపడ్డాడు. “మీరు కసాయి భర్తగా కనబడుతున్నారు. ఇంత జబ్బుతో ఉన్న ఆమెకు ఈ విషయం చెప్పడానికి మనస్సు ఎలా ఒప్పింది? మీరు చేసింది సిగ్గుచేటు కాదా? ఇక చెబుతున్నా వినండి ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ఆమె అనుకూల స్థితిలో లేదు. ఆమె శరీరం ఏమాత్రం వత్తిడి తగిలినా తట్టుకోదు. త్రోవలోనే ఆమె ప్రాణం పోవచ్చు. అయినా మీ మొండిపట్టు వదలకుండా ఆమెను తీసుకువెళతాను అని అంటే మీరు సర్వతంత్ర స్వతంత్రులు. నేను ఆమెకు మాంసం కలిపిన చారు పట్టకుండా ఒక్కరాత్రి అయినా నా ఇంట్లో వుండనీయను. మీ ఇష్టం అని అన్నాడు. అప్పుడు చిటపట చిటపట చినుకులు పడుతున్నాయి. స్టేషను దూరాన ఉన్నది. డర్బను నుండి ఫినిక్సుకు రైల్లో వెళ్ళాలి. స్టేషను నుండి ఆశ్రమానికి సుమారు రెండున్నర మైళ్ళు నడిచి వెళ్ళాలి. ప్రమాదం పొంచి ఉన్నది. దేవుడి మీద భారం వేశాను. ఒక మనిషిని ఫినిక్సుకు ముందుగా పంపించాను. ఫినిక్సులో మా దగ్గర ‘హమక్’ ఉన్నది. హమక్ అంటే చిన్న రంధ్రాలు గల బట్టతో తయారు చేయబడ్డ ఉయ్యాల లేక డోలీ అన్నమాట. హమక్ చివరికొనలు వెదురు బద్దలతో కట్టి వేస్తే రోగి హాయిగా అందు ఊగుతూ పడుకోవచ్చు. ఆ హమక్, ఒక సీసా వేడిపాలు, ఒక సీసా వేడి నీళ్ళు, ఆరుగురు మనుష్యులను స్టేషనుకు పంపమని వెస్ట్ కు కబురు పంపాను.