పుట:సత్యశోధన.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

295

ఉన్నదనీ ఒక పర్యాయం మూర్ఛపోయిందని వార్త అందింది. నా అనుమతి లేకుండా కస్తూరిబాయికి మందుల్లో కలిపి మద్యం కాని, మాంసం కాని ఇవ్వవద్దని డాక్టరుకు తెలిపాను. డాక్టరు జోహాన్సుబర్గుకు ఫోను చేశాడు. ఫోను అందుకున్నాను. “మీ భార్యకు మాంసం కలిపిన చారుగాని లేక బీఫ్ టీగానీ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. దయయుంచి అనుమతించండి” అని డాక్టరు అన్నాడు.

“నేను అందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే కస్తూరిబాయి స్వతంత్రురాలు. అపస్మారక స్థితిలో లేకపోతే ఆమెను అడగండి. ఆమె ఆంగీకరిస్తే తప్పక ఇవ్వండి” అని సమాధానం ఇచ్చాను. “ఇలాంటి సమయాల్లో నేను రోగిని అడగను. మీరు ఇక్కడికి రావడం అవసరం. నాకు ఇష్టమైన పదార్థం రోగికి ఇచ్చే స్వాతంత్ర్యం మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ భార్య ప్రాణాలకు బాధ్యత వహించను” అని డాక్టరు అన్నాడు. నేను ఆ రోజునే రైలు ఎక్కాను. డర్బను చేరాను. “మాంసం కలిపిన చారు పట్టిన తరువాతనే మీకు ఫోను చేశాను” అని డాక్టరు చెప్పాడు. “డాక్టరుగారూ! ఇది పూర్తిగా దగా” అని భావిస్తున్నాను అని అన్నాను. డాక్టరు దృఢమైన స్వరంతో ఇలా సమాధానం ఇచ్చారు. మందులు ఇచ్చే సమయంలో నేను దగాల్ని పట్టించుకోను. మేము డాక్టర్లం. మందులు ఇచ్చేటప్పుడు రోగుల్ని, వారి సంబంధీకుల్ని మోసం చేయడం పుణ్యమని భావిస్తాం అని ఆయన అన్నాడు. ఆ మాటలు విని నాకు విచారం కలిగింది. అయినా శాంతించాను. డాక్టరు నాకు మంచి మిత్రుడు, సజ్జనుడు కూడా. ఆయన, ఆయన భార్య నాకు ఎంతో ఉపకారం చేశారు. కాని ఈ వ్యవహారం నేను సహించలేకపోయాను.

“డాక్టర్‌గారూ! ఇక ఏం చేయదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఇష్టం లేకుండా ఆమెకు మాంసం పెట్టడానికి నేను సుతరాము అంగీకరించను. మాంసం తినకపోతే ఆమె చనిపోతే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” “మీ వేదాంతం నా ఇంట్లో నడవదు. మీరు మీ భార్యను నా ఇంట్లో ఉంచదలచుకుంటే నా ఇష్టం వచ్చిన ఆహారం పెడతాను. అవసరమైతే మాంసం పెడతాను. మీరు ఇందుకు ఇష్టపడకపోతే ఆమె నా ఇంట్లో మరణించడానికి నేను అంగీకరించను” అని డాక్టరు స్పష్టంగా చెప్పివేశాడు.

“అయితే ఆమెను తక్షణం తీసుకువెళ్ళమంటారా?” అని అడిగాను. “తక్షణం తీసుకువెళ్ళమని నేను అనలేదు. బంధనాలతో నన్ను బంధించవద్దని అంటున్నాను. అలా అయితే మేమిద్దరం రోగికి చేతనైనంతగా సేవ చేయగలం. మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. ఇంత స్పష్టంగా చెబుతున్న మీరు అర్థం చేసుకోకపోతే ఇక చెబుతున్నా వినండి. మీరు మీ భార్యను తీసుకువెళ్ళండి” అని డాక్టరుగారు చెప్పివేశాడు.