పుట:సత్యశోధన.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

297

రైలు కదిలే సమయం సమీపిస్తున్నందున రిక్షా తెమ్మని మనిషిని పంపాను. భయంకరమైన స్థితిలో ఉన్న కస్తూరిబాయిని ఆ రిక్షాలో ఎక్కించుకొని బయలుదేరాను. భార్యకు ధైర్యం చెప్పవలసిన అవసరం నాకు కలగలేదు. నాకు ఆమె ధైర్యం చెప్పడమే గాక “ఏం ఫరవాలేదు. మీరు భయపడకండి” అని ప్రోత్సహించింది. ఆమె అస్థిపంజరం అసలు బరువే లేదు. ఆమె ఏమీ తినలేదు. గుటక దిగడం లేదు. రైలు పెట్టెదాకా వెళ్ళాలంటే ప్లాటుఫారం మీద చాలా దూరం నడిచి వెళ్లాలి. లోపలికి రిక్షా పోనీయరు. నేను ఆమెను ఎత్తుకొని పెట్టెదాకా తీసుకువెళ్ళాను. ఫినిక్సుకు ఉయ్యాల తీసుకువచ్చారు. దానిలో రోగిని పడుకోబెట్టాము. వత్తిడి తగలకుండా ఆమెను ఫినిక్సు చేర్చాం. జలచికిత్స ప్రారంభించాను. నెమ్మదిగా ఆమె శరీరం పుంజుకోసాగింది.

ఫినిక్సు చేరుకున్న రెండు మూడు రోజులకు ఒక స్వామీజీ వచ్చాడు. నా పట్టుదలను గురించి ఆయన విన్నాడు. మా ఇద్దరికీ నచ్చచెప్పడం ప్రారంభించాడు. మణిలాలు, రామదాసులు ఇద్దరూ స్వామీజీ వచ్చినప్పుడు అక్కడే ఉన్నారని నాకు గుర్తు. మాంసాహారం తప్పుకాదని స్వామీజీ లెక్చరు ప్రారంభించాడు. మనుస్మృతి యందలి కొన్ని శ్లోకాలు వినిపించాడు. జబ్బులో వున్న భార్య ముందు ఈ రకమైన మాటలు మాట్లాడటం నాకు నచ్చలేదు. అయినా సభ్యతను దృష్టిలో పెట్టుకుని వూరుకున్నాను. మాంసాహారం సరియైనదేనని చెప్పడానికి మనుస్మృతి యందలి శ్లోకాలు వల్లించవలసిన అవసరం లేదు. ఆ శ్లోకాలు నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అనే వాదనను గురించి కూడా నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అయినా కాకపోయినా మాంసరహిత ఆహారం విషయమై నేను దృఢమైన నిర్ణయానికి వచ్చేశాను. దానికి తిరుగులేదు. పైగా కస్తూరిబాయి దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది. పాపం ఆమెకు శాస్త్రాల గొడవ ఏం తెలుసు? ఆమె దృష్టిలో తండ్రి తాతల ప్రవర్తనే ధర్మం. అదే ఆమెకు ప్రమాణం. మా పిల్లలకు తన తండ్రి అభిప్రాయాలు బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు స్వామీజీని ఆటలు పట్టించసాగారు. చివరికి కస్తూరిబాయి అందుకొని “స్వామీజీ! మీరు ఏం చెప్పినా సరే, నేను మాత్రం మాంసం ముట్టను. మాంసం తిని జబ్బు నయం చేసుకోవడానికి ఇష్టపడను. ఇక నా మెదడు కొరక్కండి. దయయుంచి నన్ను వదలండి. మిగతా విషయం నా బిడ్డల తండ్రితో తరువాత మాట్లాడండి” అని ఖరాఖండిగా చెప్పేసింది.