పుట:సత్యశోధన.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

293

చాలా జాగ్రత్తపడ్డాను. అందువల్లనే ఈ శరీరాన్ని ఇన్ని సంవత్సరాలనుండి నిలబెట్టి ఉంచగలిగాను. దానిచేత పని చేయించగలిగాను.

ఈ విధమైన జ్ఞానం సంపాదించి అట్టి వారి సాంగత్యం కూడా పొంది ఏకాదశి నాడు పండ్లు తిని ఉండటం, ఉపవాసం చేయడం ప్రారంభించాను. కృష్ణ జన్మాష్టమి మొదలుగా గల వ్రతాలు ప్రారంభించాను. అయితే పండ్లు తినడం, భోజనం చేయడం రెండిటిలో ఎక్కువ తేడా నాకు కనబడలేదు. పండ్లు తిండిగింజలు రెండిటి ద్వారా మనం పొందే ఆనందం ఒకే రకంగా ఉంటుంది. పండ్లు తినడం అలవాటు అయితే ఆనందం అధికంగా లభిస్తుంది. అందువల్ల రోజంతా ఉపవాసం చేయడమో లేక ఒక పూట భోజనం చేయడమో చేసి చూచాను. ప్రాయశ్చిత్తం నెపంతో కొన్ని పూటలు భోజనం మాని కూడా చూచాను.

దీనితో కొన్ని అనుభవాలు కలిగాయి. శరీరం ఎంత శుభ్రంగా ఉంటుందో అంతగా రుచియుందు కోరిక, ఆకలి పెరుగుతాయి. ఉపవాసాలు సంయమనానికేగాక, భోగాధిక్యతకు కూడా ఉపయోగపడతాయని తెలుసుకున్నాను. నాకేగాక నాతోబాటు ప్రయోగాలు చేసిన వారికి కూడా ఇదే విధమైన అనుభవం కలిగింది. శరీరాన్ని పుష్టిగా, తుష్టిగా వుంచుకోవడం, సంయమం అలవరుచుకోవడం, రుచుల వాంఛను జయించడం ఇవే నా లక్ష్యాలు. అందుకోసం తినే పదార్థాల్లో చాలా మార్పులు చేశాను. అసలు రసాస్వాదనం నీడలా మనిషిని సదా వెంబడిస్తూ ఉంటుంది. ఒక పదార్థం తినడం మానుకొని మరో పదార్థం పుచ్చుకోవడం ప్రారంభిస్తే అది ఎక్కువగా అలవాటవుతూ ఉంటుంది.

నా ప్రయోగాలలో కొంత మంది మిత్రులు కూడా పాల్గొంటూ ఉండేవారు. అట్టివారిలో హర్మన్ కేలన్ బెక్ ముఖ్యుడు. దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో ఆయనను పాఠకులకు పరిచయం చేశాను. అందువల్ల ఈ ప్రకరణంలో ఆ విషయం మళ్లీ వ్రాయను. ఆయన కూడా నాతో బాటు అన్ని ప్రయోగాలు చేశారు. ఏకాదశి ఉపవాసం, రోజంతా ఉపవాసం, ఒక పూట ఉపవాసం మొదలుగాగలవన్నీ చేశాడు. యుద్ధం తీవ్రంగా సాగుతూ ఉన్నప్పుడు నేను వారి ఇంట్లో ఉండేవాణ్ణి. మేము చేసిన ప్రయోగాలను గురించి చర్చించుకొనేవారం. మార్పు చేసినప్పుడు ఆయన అధికంగా సంతోషం పొందేవాడు. అప్పుడు మా సంభాషణ తీయగా సాగుతూ ఉండేది. తప్పు అని అనిపించేది కాదు. కాని తరువాత అనుభవం గడిచినకొద్దీ ఆ విధమైన రసవత్తర సంభాషణ కూడా తగదని తెలుసుకున్నాను. మనిషి రసానందం కోసం ఏమీ