పుట:సత్యశోధన.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

ఆహారంలో వివిధ ప్రయోగాలు

తినకూడదని కేవలం శరీర పోషణ కోసమే తినాలనీ తేల్చుకున్నాను. ప్రతి ఇంద్రియం కేవలం శరీరం కోసం, శరీరం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కోసం పనిచేస్తుంది. అప్పుడు అందలి రసానుభూతి తగ్గిపోతుంది. అప్పుడే ఇంద్రియాలు సహజంగా పనిచేస్తున్నాయని గ్రహించాలి. ఇట్టి సహజత్వం కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా తక్కువేనని మనం తెలుసుకోవాలి. ఆ కృషిలో శరీరాల్ని ఆహుతి చేయవలసి వచ్చినా వెనుకాడకూడదని గ్రహించాలి. ఇప్పుడు అంతా ఉల్టా వ్యవహారమే నడుస్తున్నది. నాశనమై పోయే శరీరం యొక్క శోభను పెంచడానికి, దాని వయస్సును పెంచడానికి ఇతర ప్రాణుల్ని బలిచేస్తున్నాం. అందువల్ల శరీరం, ఆత్మ రెండూ హూనమైపోతాయి. ఒక వ్యాధి వస్తే దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నించి రుచులు మరిగి, క్రొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. భోగశక్తిని కూడా పోగొట్టుకుంటాం. ఇదంతా మన కండ్ల ఎదుట జరుగుతూ ఉన్నది. మనం చూచి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నాం. కండ్లు మూసుకుంటున్నామన్నమాట.

ఆహార పదార్థాల మార్పును గురించి వివరించాను. అందలి అర్థాన్ని పాఠకులు గమనించాలి. ఆ దృష్టితో వాటి ఉద్దేశ్యం, వాటి వెనుక గల యోచనా సరళిని వివరించడం అవసరం కదా! అందుకే ఇంత వివరం వ్రాశాను.

28. నా భార్య యొక్క దృఢచిత్తత

కస్తూరిబాయి మీద జబ్బులు మూడుసార్లు దాడి చేశాయి. ఆ మూడింటిబారి నుండి ఆమె గృహ చికిత్సల ద్వారా తప్పించుకున్నది. మొదటి దాడి సత్యాగ్రహ సమరం సాగుతున్నప్పుడు జరిగింది. ఆమెకు మాటిమాటికి రక్తస్రావం జరుగుతూ ఉండేది. మిత్రుడగు ఒక డాక్టరు ఆపరేషన్ చేయడం అవసరమని చెప్పాడు. ఎంతో చెప్పిన మీదట ఆమె అందుకు అంగీకరించింది. శరీరం బాగా క్షీణించింది. మత్తుమందు ఇవ్వకుండానే డాక్టరు ఆపరేషన్ చేశాడు. కత్తులు పనిచేస్తున్నప్పుడు అపరిమితంగా బాధ కలిగింది. కాని ఎంతో సహనం, ధైర్యంతో ఆమె ఆ బాధను సహించింది. అది చూచి నేను నివ్వెరపోయాను. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. డాక్టరు, ఆయన భార్య ఇద్దరూ కస్తూరిబాయికి మంచి సేవ చేశారు.

ఇదంతా డర్బనులో జరిగింది. రెండు మూడు రోజుల తరువాత, నిశ్చింతగా జోహన్సుబర్గు వెళ్లమని డాక్టరు నాకు సలహా ఇచ్చాడు. నేను వెళ్లిపోయాను. కొద్దిరోజులు గడిచాయి. కస్తూరిబాయి శరీరం పూర్తిగా బలహీనమైపోయిందనీ లేవలేని స్థితిలో