పుట:సత్యశోధన.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

జూలూల తిరుగుబాటు

సుపరిచితాలు. గొప్ప గొప్ప ఆంగ్లేయుల మధ్య వుండటం వల్ల, ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడబడే దేశంలో నివసించడం వల్ల వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడటం, వ్రాయడం బాగా నేర్చుకున్నారు.

24. జూలూల తిరుగుబాటు

దక్షిణ ఆఫ్రికాలో కాపురం పెట్టిన తరువాత స్థిరంగా కూర్చునే అదృష్టం నా నొసట రాసి లేదు. జోహన్సుబర్గులో కొంచెం స్థిరపడుతూ ఉండగా ఒక ఊహించని ఘట్టం జరిగింది. నేటాలులో జూలూలు తిరుగుబాటు చేశారని వార్త చదివాను. నాకు జూలూలతో శతృత్వం లేదు. వాళ్ళు ఒక్క హిందూ దేశస్థుడి జోలికి కూడా పోలేదు. తిరుగుబాటని, విద్రోహమని అనడం విషయంలో నాకు సందేహం ఉన్నది. అయితే ఆరోజుల్లో ఆంగ్ల సామ్రాజ్యం జగద్రక్షణకు అవసరమని నా అభిప్రాయం. హృదయపూర్తిగా ఆంగ్ల ప్రభుత్వం యెడ నాకు విశ్వాసం ఉంది. ఆ సామ్రాజ్యం నష్టపడటం నాకు ఇష్టం లేదు. అందువల్ల బలప్రయోగాన్ని గురించి గాని, నీతి అవినీతి అను విషయమై గాని నాకు పట్టింపు లేదు. నేను చేయబోయే చర్యను అది ఆపలేదు. నేటాలుకు కష్టం కలిగినప్పుడు రక్షణకోసం వాలంటీర్ల సైన్యం ఉన్నది. పని పడ్డప్పుడు ఆ సైన్యంలో క్రొత్తవాళ్ళను కొద్దిగా చేర్చుకునేవారు. వాలంటీర్ల సైన్యం ఈ తిరుగుబాటును శాంతింపచేసేందుకు బయలుదేరిందని చదివాను.

నేను నేటాలు వాసినేనని భావించాను. నేటాలుతో నాకు దగ్గర సంబంధం కూడా ఉంది. అందువల్ల నేను అక్కడి గవర్నరుకు జాబు వ్రాశాను. అవసరమైతే హిందూ దేశస్థుల దళాన్ని వెంటబెట్టుకొని యుద్ధరంగంలోకి వెళతానని, క్షత్రగాత్రులకు సేవచేస్తానని ఆ జాబులో వ్రాశాను. గవర్నరు వెంటనే సరేనంటూ సమాధానం పంపాడు. ఇంత త్వరగా అనుకూలంగా సమాధానం వస్తుందని ఊహించలేదు. అయితే జాబు వ్రాసేముందు ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను. గవర్నరు నుండి అనుకూలంగా సమాధానం వస్తే ఇప్పటి ఇల్లు వదిలివేయాలని, మి. పోలక్ చిన్న ఇల్లు తీసుకొని అందులో ఉండాలని నిర్ణయం గైకొన్నాము. ఇందుకు కస్తూరిబాయి అంగీకరించింది. ఇలాంటి నా నిర్ణయాలను ఆమె ఎప్పుడూ ఎదిరించలేదని నాకు బాగా గుర్తు. గవర్నరు నుండి సమాధానం రాగానే ఇంటి యజమానికి ఒక మాసం ముందుగా నోటీసు పంపి ఇల్లు ఖాళీ చేస్తామని తెలియజేశాము. కొంత సామాను ఫినిక్సుకు పంపాము. కొద్ది సామాను పోలక్ దగ్గర ఉంచాము.