పుట:సత్యశోధన.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

287

డర్బను చేరగానే మనుష్యులు కావాలని ప్రకటించాను. పెద్ద దళం అవసరం లేదని తెలిసి 24 మందిమి కలిపి దళంగా ఏర్పడ్డాం. వారిలో నేను గాక నలుగురు గుజరాతీలు ఉన్నారు. మిగతావారు మద్రాసుకు చెందిన గిర్‌మిటియా ప్రధ నుండి విముక్తి పొందినవారు. ఒకరు పఠాను. చీఫ్ మెడికల్ ఆఫీసరు నాకు “సార్జంట్ మేజర్” అను హోదా తాత్కాలికంగా ఇచ్చాడు. అది మా ఆత్మసన్మానానికి గుర్తుగా, పని సౌలభ్యం కోసం, అట్టి రివాజు వుండటం వల్ల ఆ ఆఫీసరు ఆ హోదా ఇచ్చాడు. నేను చెప్పిన ముగ్గురికి సార్జంటు హోదా మరియు కార్పోరల్ హోదా ఇచ్చాడు. డ్రస్సు కూడా ప్రభుత్వమే మాకు ఇచ్చింది. మా దళ సభ్యులు ఆరు వారాల పాటు సేవ చేశారు.

తిరుగుబాటు స్థావరం చేరి అక్కడ తిరుగుబాటు అనేదే లేదని తెలుసుకున్నాము. తిరుగుబాటు చేస్తూ ఎవ్వరూ కనబడలేదు. ఒక జూలూ సర్దారు క్రొత్తగా జూలూలపై విధించబడ్డ పన్ను చెల్లించవద్దని సలహా ఇచ్చాడట. పన్ను వసూలు చేసేందుకు వెళ్ళిన ఒక సార్జెంటును వాళ్ళు చంపివేశారట. అందువల్ల దీన్ని తిరుగుబాటు అని అన్నారు. ఏది ఏమైనా నా హృదయం మాత్రం జూలూలకు అనుకూలంగా ఉన్నది. ముఖ్య స్థావరం చేరిన తరువాత సంగ్రామంలో గాయపడిన జూలూలకు మేము సేవ శుశ్రూష చేయవలసి వచ్చింది. అందుకు నేను ఎంతో సంతోషించాను.

మెడికల్ ఆఫీసరు మాకు స్వాగతం పలికాడు. “తెల్లవాళ్ళెవళ్ళూ గాయపడ్డ జూలూలకు సేవ చేసేందుకు సిద్ధపడటం లేదు. నేను ఒక్కణ్ణి ఎంతమందికి సేవ చేయగలను? వాళ్ల గాయాలు మురుగుతున్నాయి. సమయానికి మీరు రావడం వాళ్ళ ఎడ దేవుడు చూపిన కృపయేయని నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే అతడు మాకు పట్టీలు, క్రిమినాశక మందులు, లోషన్లు వగైరాలు ఇచ్చి క్షతగాత్రులైన జూలూల దగ్గరికి తీసుకువెళ్ళాడు. మమ్మల్ని చూచి జూలూలు ఎంతో సంతోషించారు. తెల్ల సిపాయిలు తెరల వెనుకనుండి తొంగి చూస్తూ గాయాలకు మందులు రాయవద్దని, పట్టీలు కట్టవద్దని మాకు సైగ చేయసాగారు. మేము వాళ్ళ మాట పట్టించుకోనందున కోప్పడసాగారు. చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేలా గాయపడిన జూలూలను బండ బూతులు తిట్టడం ప్రారంభించారు.

తరువాత ఆ సిపాయిలతో కూడా నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళు నన్ను ఆదరించారు. 1896లో నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన కర్నల్ సార్క్సు, కర్నల్ వాయిలీలు అక్కడే ఉన్నారు. వాళ్ళు నేను చేస్తున్నపని చూచి నివ్వెరపోయారు. నన్ను ప్రత్యేకించి పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను జనరల్ మెకంజీ దగ్గరికి కూడా తీసుకువెళ్ళారు.