పుట:సత్యశోధన.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

285

కూడా ప్రకటించాడు. ఇతరులు ఉదారహృదయంతో ఈ దోషాన్ని అనివార్యమని భావించి ఊరుకున్నారు. ఈ దోషానికి నేను పశ్చాత్తాపపడలేదు. అయినా ఆదర్శ తండ్రి కాజాలకపోవడం వరకే అది నిమిత్తం. అజ్ఞానం వల్ల జరిగిన వాళ్ళ చదువును హోమం చేసిన మాట నిజమే. సద్భావంతో వాళ్ళను సేవారంగంలో ప్రవేశపెడదామనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను. అయితే వాళ్ళ శీలనిర్మాణం కోసం చేయవలసిందంతా చేశాను. లోటు ఏమీ చేయలేదు. ఇలా చేయడం ప్రతి తల్లి తండ్రి కర్తవ్యమని భావిస్తున్నాను.

అయినా నా పిల్లల శీలంలో ఎక్కడైనా దోషం ఉంటే అది మా దంపతుల దోషమని భావిస్తున్నాను. బిడ్డలకు తల్లిదండ్రుల రూపురేఖలు వారసత్వంగా లభించినట్లే వారి గుణదోషాలు కూడా తప్పక లభిస్తాయి. పరిసరాల ప్రభావం వల్ల వారిలో రకరకాల గుణదోషాలు చోటు చేసుకుంటాయి. అయితే అసలు ఆస్థి మాత్రం తండ్రి తాతల ద్వారానే వాళ్లకు లభిస్తుంది గదా! అట్టి దోషాలనుండి కొంతమంది పిల్లలు తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అది ఆత్మ స్వభావం. అట్టివారికి అభినందనలు.

నా పిల్లలకు జరిపిన ఇంగ్లీషు శిక్షణను గురించి పోలక్‌కు నాకు అప్పుడప్పుడు వేడివేడిగా చర్చలు జరిగాయి. బాల్యంనుండే తమ పిల్లల చేత ఇంగ్లీషు మాట్లాడించేందుకు తంటాలుపడే తల్లితండ్రులు తమకు, తమ దేశానికి ద్రోహం చేస్తున్నారని నా నిశ్చితాభిప్రాయం. ఇందువల్ల పిల్లలు తమ దేశ ధార్మిక, సాంఘిక వారసత్వం నుండి వంచితులవుతారని నా అభిప్రాయం. వాళ్ళు దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకు యోగ్యత తక్కువగా పొందుతారని నా భావన. ఈ కారణాల వల్లనే నేను నా పిల్లలతో కావాలనే గుజరాతీ భాషలో మాట్లాడుతూ ఉండేవాడిని. పోలక్‌కు నా ఈ పద్ధతి నచ్చలేదు. నేను పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్నానని పోలక్ భావించాడు. ఇంగ్లీషు వంటి వ్యాప్తి చెందిన భాషను పిల్లలు చిన్నప్పటినుండే నేర్చుకుంటే ప్రపంచంలో సాగే పరుగుపందెంలో పెద్ద అడుగు సహజంగా వేయగలుగుతారని ప్రేమతోను, పట్టుదలతోను నాకు నచ్చచెబుతూ ఉండేవాడు. ఆయన సలహా నాకు నచ్చలేదు. నా భావం నచ్చక చివరకు మౌనం వహించాడో లేదో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ చర్చలు జరిగి సుమారు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు నాకు కలిగిన భావాలు కాలం గడిచినకొద్దీ గట్టిపడ్డాయి. నా బిడ్డలు అక్షరజ్ఞానంలో వెనుకబడ్డారేమో కాని జ్ఞానం సులభంగా పొందగలిగారని చెప్పగలను. దాని వల్ల వాళ్ళకు, దేశానికి మేలు జరిగిందని చెప్పగలను. ఇవాళ వాళ్ళు విదేశస్థుల వలె లేరు. రెండు భాషలు వారికి