పుట:సత్యశోధన.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

281

ఇన్ని వివరాలు వ్రాస్తున్న కారణం నా ప్రయోగాలు సఫలమయ్యాయని చెప్పడానికి కాదు. ఏ ప్రయోగం కూడా పూర్తిగా సఫలం అని చెప్పడానికి వీలులేదు. డాక్టర్లు కూడా అలా చెప్పలేదు. అయితే క్రొత్త ప్రయోగాలు చేయదలచిన వారు మొదట తమతోనే ప్రారంభించాలని నా అభిప్రాయం. ఆ విధంగా చేస్తే నిజం త్వరగా బయటబడుతుంది. ఇట్టి ప్రయోగాలు చేసేవారిని భగవంతుడు రక్షిస్తాడు కూడా.

మట్టి ప్రయోగాలు ఎంత ప్రమాదకరమైనవో, యూరోపియన్లతో సంబంధం పెట్టుకోవడం కూడా అంత ప్రమాదకరమైన వ్యవహారమే. రంగులో తేడాయేగాని, అందరి వ్యవహారం ఒకటే. ఈ విషయం ముందుగా నేను గ్రహించలేదు. మిస్టర్ పోలక్‌ను నాతోబాటు వుండమని ఆహ్వానించాను. మేమిద్దరం సొంత సోదరుల్లా వుండేవారం. పోలక్ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ అమ్మాయితో చాలాకాలం నుండి అతనికి స్నేహం ఉన్నది. అయితే కొంత డబ్బు సమకూర్చుకున్న తరువాత వివాహం చేసుకుందామని ఎదురు చూడసాగాడు. రస్కిన్ రచనలు నాకంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు కాని పాశ్చాత్యదేశాలలో రస్కిన్ భావాలను పూర్తిగా అమలు చేయడాన్ని గురించి ఆయనకు ఆశలేదు.

“మనస్సులు కలిసిన తరువాత డబ్బు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం సరిపోదు. ఈ ప్రకారంగా అయితే బీదవాడెవడూ పెండ్లి చేసుకోవడానికి వీలు వుండదు. ఇప్పుడు మీరు నాతోబాటు ఉన్నారు. అందువల్ల ఇంటి ఖర్చును గురించిన సమస్య ఉండదు. మీరు త్వరగా పెండ్లి చేసుకోండి” అని నేను చెప్పాను.

నేనెప్పుడూ పోలక్‌తో రెండుసార్లు ఏ విషయమూ చర్చించలేదు. నా సలహాను వెంటనే అంగీకరించాడు. మిసెస్ పోలక్ ఇంగ్లాండులో ఉన్నది. ఆమెతో ఉత్తరాలు నడిచాయి. ఆమె అంగీకరించింది. కొద్ది మాసాలలోనే ఆమె పెండ్లి కోసం జోహన్సుబర్గు వచ్చింది. మేము పెండ్లికి ఖర్చు ఏమీ చేయలేదు. బట్టలు కూడా కొనలేదు. మత విధానాలతో కూడా వారికి పనిలేదు. మిసెస్ పోలక్‌ది క్రైస్తవమతం. మిష్టర్ పోలక్ యూదుడు. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం నీతికి సంబంధించిన ధర్మం మాత్రమే.

ఈ వివాహానికి సంబంధించిన విచిత్ర విషయం వ్రాస్తాను. ట్రాన్సువాలులో తెల్లవారి పెళ్ళిళ్ళను రిజిష్టరు చేసే అధికారి నల్లవాళ్ళ పెళ్ళిళ్ళను రిజిష్టరు చేయడు. ఈ వివాహంలో నేను సాక్షిని. వెతికితే మాకు ఒక తెల్లవాడు దొరికేవాడే కాని పోలక్ అందుకు అంగీకరించలేదు. మేము ముగ్గురం అధికారి దగ్గరికి వెళ్ళాం. నేను సాక్షిగా వున్నాను గనుక వరుడు వధువు ఇద్దరూ తెల్లవారేనని ఎలా నమ్ముతాడు. వివరాలు