పుట:సత్యశోధన.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

ఎవరిని దేవుడు రక్షిస్తాడో

తెలుసుకోవడానికి వాయిదా వేద్దామని చూచాడు. మరునాడు నేటాలులో పండుగ దినం. పెండ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న మీదట ఈ విధమైన కారణాలతో ముహూర్తాన్ని వాయిదా వేయడం ఎవ్వరూ సహించలేకపోయారు. పెద్ద మేజిస్ట్రేటును నేను ఎరుగుదును. ఆయన ఈ శాఖకు పెద్ద అధికారి. దంపతులిద్దరినీ వెంటబెట్టుకొని వెళ్ళి ఆయనను కలిశాను. ఆయన నవ్వుతూ, నాకు జాబు వ్రాసి ఇచ్చాడు. ఈ విధంగా పెండ్లి రిజిస్టరు అయిపోయింది.

ఇప్పటివరకు కొంతమంది తెల్లవాళ్ళు మాతోబాటు వున్నారు. వారితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఒక అపరిచితురాలు మా ఇంట్లో ప్రవేశించిందన్నమాట. ఎన్నడూ ఏ విధమైన తంటా ఆమె వల్ల వచ్చినట్లు నాకు గుర్తులేదు. కాని అనేక జాతులవాళ్ళు, అనేక స్వభావాల వాళ్ళు హిందూ దేశస్థులు వచ్చి వెళ్ళేచోట, అనుభవం లేని నా భార్యవంటి వారు ఉన్న చోట, వారిద్దరికీ (శ్రీ. శ్రీమతి పోలక్) ఏమైనా ఇబ్బంది కలిగితే కలిగి యుండవచ్చు. ఒకే జాతివాళ్ళు వుండే కుటుంబాలలో కూడా వివాదాలు బయలుదేరుతూ ఉంటాయి. ఆ దృష్టితో చూస్తే విజాతీయులు వున్న మా గృహంలో వివాదాలు బాగా తక్కువేనని చెప్పవచ్చు. అసలు అట్టివి లేవనే చెప్పవచ్చు. నిజానికి సజాతీయులు, విజాతీయులు అను భావం మనస్సులో బయలుదేరే నీటితరంగం వంటిది. మేమంతా ఒకే కుటుంబీకులంగా వున్నాం.

వెస్ట్ వివాహం కూడా ఇక్కడే చేయాలని భావించాను. ఆ సమయంలో బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు యింకా నాకు కలుగలేదు. అందువల్ల పెండ్లి కాని స్నేహితులకు పెండ్లి చేయడం నా పని అయింది. వెస్ట్ తన తల్లి తండ్రుల్ని చూచేందుకు ఇంగ్లాండు బయలుదేరినప్పుడు పెండ్లి చేసుకురమ్మని అతనికి సలహా ఇచ్చాను. ఫినిక్సు ఇప్పుడు వారందరికీ స్థావరం అయింది. అంతా రైతులుగా మారిపోయారు. అందువల్ల వివాహానికి వంశవృద్ధికి భయపడనవసరం లేకుండా పోయింది.

లెస్టర్‌కు చెందిన ఒక అందమైన అమ్మాయిని పెండ్లి చేసుకొని వెస్ట్ వెంట తీసుకువచ్చాడు. ఆ సోదరి కుటుంబం వారు లెఫ్టర్‌లో చెప్పుల పరిశ్రమ యందు పనిచేస్తున్నారు. మిసెస్ వెస్ట్ కూడా కొంత కాలం చెప్పుల కార్ఖానాలో పనిచేసింది. ఆమెను ‘సుందరి’ అని పిలిచాను. ఆమె గుణాలు బహు సుందరమైనవి కావడమే అందుకు కారణం. వెస్ట్ తన అత్తగారిని కూడా వెంట తీసుకువచ్చాడు. ఆమె సుగుణాలు గల వృద్ధ వనిత. ఆమె ఇంకా జీవించే యున్నది. శ్రమ చేసే స్వభావంతో, నవ్వుముఖంతో మమ్మల్నందరినీ సిగ్గుపడేలాచేస్తూ ఉన్నది.