పుట:సత్యశోధన.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

ఎవరిని దేవుడు రక్షిస్తాడో


22. ఎవరిని దేవుడు రక్షిస్తాడో

త్వరగా హిందూదేశం వెళ్ళి స్థిరపడాలనే కాంక్ష వదులుకున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వస్తానని భార్యకు నచ్చచెప్పి దక్షిణ ఆఫ్రికా వచ్చాను. సంవత్సరం గడిచిపోయింది. తిరిగి దేశం వెళ్ళడం పడలేదు. అందువల్ల భార్యాబిడ్డల్ని పిలిపించాలని నిర్ణయించుకున్నాను.

పిల్లలు వచ్చారు. మా మూడో పిల్లవాడు రామదాసు. త్రోవలో మా వాడు కెప్టనుతో స్నేహం పట్టాడు. ఆయనతో ఆడుతూ వుండగా మా వాడి చేయి విరిగింది. కెప్టెను పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూచాడు. డాక్టరు ఎముకను సరిచేశాడు. జోహన్సుబర్గు చేరినప్పుడు కర్రచెక్కల మధ్య మెడలో వేసినపట్టీలో చెయ్యి కట్టివేసివున్నది. చేతికి తగిలిన గాయాన్ని డాక్టరుకు చూపించి నయం చేయించడం అవసరమని ఓడ డాక్టరు సలహా ఇచ్చాడు. కాని ఆ రోజుల్లో నా మట్టి పట్టీల చికిత్స జోరుగా సాగుతున్నది. నా దేశవాళీ చికిత్స మీద విశ్వాసం గల కక్షిదారులకు నేను మట్టితోను, నీటితోను చికిత్స చేస్తున్నాను. రామదాసును మరో వైద్యుని దగ్గరికి ఎలా పంపుతాను? వాడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. “నీ గాయనికి పట్టీలు వగైరా కట్టి చికిత్స చేస్తే భయపడతావా” అని మావాణ్ణి అడిగాను. రామదాసు నవ్వుతూ నాకు అనుమతి ఇచ్చాడు. ఈ వయస్సులో మంచి చెడ్డల పరిజ్ఞానం వాడికి లేకపోయినా డాక్టరీకి, దేశవాళీ వైద్యానికి గల తేడా వాడికి తెలుసు. నా ప్రయోగాలను గురించి వాడికి తెలుసు. నా మీద గల విశ్వాసంతో వాడు నా చేత చికిత్స చేయించుకునేందుకు భయపడలేదు.

వణుకుతున్న చేతులతో వాడి పట్టీ ఊడతీశాను. గాయం కడిగి శుభ్రం చేశాను, మట్టి పట్టీ గాయం మీద వేసి మొదటిలాగానే తిరిగి మెడకు పట్టీ కట్టివేశాను. డాక్టరు కట్టే పట్టీలకు కూడా ఇంత సమయం పడుతుందని ఓడ డాక్టరు చెప్పడం జరిగింది. మట్టి చికిత్స పై నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత ప్రయోగాలు చేయసాగాను. గాయాలు, జ్వరం, అజీర్ణం, పాండురోగం మొదలుగాగల వ్యాధులకు మట్టితోను, నీటితోను మరియు ఉపవాసాలు చేయించి చాలామందికి చికిత్స చేశాను. రోగుల్లో చిన్న పెద్ద అంతా వుండేవారు. చాలామందికి నా చికిత్స వల్ల రోగాలు నయమయ్యాయి. ఈ చికిత్సపై దక్షిణ ఆఫ్రికాలో నాకు గట్టి విశ్వాసం వుండేది. అంత విశ్వాసం ఇక్కడకు వచ్చాక తగ్గిపోయింది. ఈ ప్రయోగాలలో ప్రమాదం అధికమని అందువల్ల జాగరూకత అవసరమని అనుభవం వల్ల తెల్చుకున్నాను.