పుట:సత్యశోధన.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

259

ప్రెస్సు ఆయన నడుపుతూ వున్నాడు. పత్రిక వెలువరించాలనే కోరికను సమర్థించాను. 1904లో ఈ పత్రిక ప్రారంభించబడింది. మనసుఖలాల్ నాజరు ఆ పత్రికకు ఎడిటరుగా ఉన్నారు. కాని సంపాదకత్వపు నిజమైన భారమంతా నా మీద పడింది. మొదటనుండి నాకు దూరాన ఉండి పత్రికలు నడిపించే యోగం కలుగుతూ వచ్చింది.

మన సుఖలాల్ నాజరు సంపాదకులుగా లేరని కాదు. వారు దేశమందలి చాలా పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ వుండేవారు. దక్షిణ ఆఫ్రికాలోగల చిక్కులతో కూడిన పలు సమస్యలను గురించి నేనుండగా స్వతంత్రంగా వ్యాసాలు వ్రాయడానికి ఆయన సాహసించలేదు. నా యోచనా శక్తిమీద ఆయనకు అమిత విశ్వాసం. అందువల్ల ఏమైనా ప్రధాన విషయాలపై వ్రాయవలసి వస్తే ఆ భారం నా మీద మోపుతూ వుండేవాడు.

ఇండియన్ ఒపీనియన్ వారపత్రిక ప్రారంభంలో గుజరాతీ, హిందీ, తమిళం, ఇంగ్లీషుల్లో వెలువడుతూ ఉండేది. తమిళం, హిందీ శాఖలు పేరుకు మాత్రమే ఉండటం చూచాను. వాటివల్ల సమాజానికి సేవ జరిగే స్థితి కలుగకపోవడం వల్ల అందు నాకు అసత్యం గోచరించింది. వెంటనే వాటిని మూసివేయించాను. ఆ తరువాతనే నాకు శాంతి లభించింది.

ఈ పత్రిక కోసం డబ్బు నేను ఖర్చు పెట్టవలసి వస్తుందని ఊహించలేదు. కొద్ది రోజులకే డబ్బు ఖర్చు పెట్టక పోతే పత్రిక నడవదని తెలిసిపోయింది. నేను పత్రికకు సంపాదకుణ్ణి కాదు. అయినా వ్యాసాల విషయమై బాధ్యత వహించాను. ఈ విషయం హిందూ దేశస్థులు, యూరోపియన్లు కూడా గ్రహించారు. అసలు పత్రిక ప్రకటించబడిన తరువాత మూత బడితే నా దృష్టిలో జాతికే అవమానం, నష్టం కూడా,

నేను పత్రిక కోసం డబ్బు ఖర్చు పెట్టడం ప్రారంభించాను. నా దగ్గర మిగిలిందంతా దానికి ఖర్చు పెడుతూనే వున్నాను. ప్రతి మాసం 75 పౌండ్లు ఇవ్వవలసి వస్తుండేది.

ఇన్ని సంవత్సరాల తరువాత పరిశీలించి చూస్తే ఈ పత్రిక జాతికి చాలా సేవ చేసిందని చెప్పగలను. ఆ పత్రిక ద్వారా ధనం గడించాలని ఎవ్వరం అసలు అనుకోలేదు.

పత్రిక నా చేతిలో వున్నంత కాలం దానిలో జరిగిన మార్పులు నా జీవితంలో కలిగిన మార్పులకు ప్రతీకలే. నేడు యంగ్ ఇండియా, నవజీవన్ నా జీవితమందలి కొంత భాగానికి ప్రతీకలు అయినట్లే ఇండియన్ ఒపీనియన్ కూడా అయింది.