పుట:సత్యశోధన.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

ఇండియన్ ఒపీనియన్

పని వున్నప్పుడు రాత్రనక పగలనక అమితంగా శ్రమపడేది. అర్థరాత్రి సమయంలో కూడా పనిబడితే ఒంటరిగా వెళుతూ వుండేది. ఎవరినైనా వెంట పంపాలని ప్రయత్నిస్తే నన్ను కోపంగా చూచేది. వేలాదిమంది హిందూదేశస్తులు ఆమెను గౌరవభావంతో చూచేవారు. అంతా ఆమె మాట వినేవారు. మేమంతా జైల్లో వున్నప్పుడు, బాధ్యత గలవారెవ్వరూ బయటలేనప్పుడు ఆమె ఒక్కతే సత్యాగ్రహ సంగ్రామం నడిపించింది. లక్షలాది రూపాయల లెక్కలు ఆమెవ్రాసింది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆమె జరిపింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికను కూడా ఆమె నడిపింది. అలసట అంటే ఏమిటో ఆమె ఎరుగదు.

మిస్ శ్లేశిన్ గురించి ఎంత వ్రాసినా తనివి తీరదు. గోఖ్లేగారి సర్టిఫికెట్టు గురించి చెప్పి ఈ ప్రకరణం ముగిస్తాను. గోఖ్లేగారు నా అనుచరులందరిని పరిచయం చేసుకున్నారు. పరిచయం అయిన తరువాత చాలామంది విషయంలో వారు సంతోషించారు. ప్రతి ఒక్కరి చరిత్రను వారి విలువలను అంచనా వేశారు. హిందూ దేశానికి చెందిన నా అనుచరులు, యూరోపుకు చెందిన నా అనుచరులు అందరిలో వారు మిస్ శ్లేశిన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. “ఇంతటి త్యాగం, ఇంతటి పవిత్రత, ఇంత నిర్భీకత, ఇంతటి కార్యకుశలత బహు కొద్దిమంది లోనే నేను చూచాను. మిస్ శ్లేశిన్ మీ అనుచరులందరిలోను ప్రథమ స్థానం పొందుటకు అర్హురాలు” అని వారు ప్రకటించారు.

13. ఇండియన్ ఒపీనియన్

ఇంకా కొంతమంది యూరోపియన్లను గురించి వ్రాయవలసిన అవసరం ఉన్నది. అంతకు ముందు మరో రెండు మూడు మహత్తరమైన విషయాలను గురించి వ్రాయడం అవసరం. ఇప్పుడే ఒకరిని గురించి వ్రాస్తాను. మిస్ డిక్‌ను నియమించి నా పని పూర్తి చేయగలిగానని అనుకోవడం సరికాదు. మి.రీచ్‌ని గురించి నేను మొదటనే వ్రాశాను. ఆయనతో నాకు బాగా పరిచయం వున్నది. ఆయన ఒక వ్యాపార సంస్థ సంచాలకులు. అక్కడి నుండి తప్పుకొని నా దగ్గర ఆర్టికల్ క్లర్కుగా పని చేయమని వారిని కోరాను. నా సలహా వారికి నచ్చింది. వారు నా ఆఫీసులో చేరారు. నా పనిభారం కొంత తగ్గించారు.

ఇదే సమయంలో శ్రీ మదనజీత్ “ఇండియన్ ఒపీనియన్” అను పత్రికను వెలువరించాలని నిర్ణయించుకున్నాడు. నన్ను సలహా సహకారాలు యిమ్మని కోరాడు.