పుట:సత్యశోధన.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

ఇండియన్ ఒపీనియన్

దానియందు నేను ప్రతివారం నా ఆత్మను క్రుమ్మరించేవాణ్ణి. నేను దేన్ని సత్యాగ్రహం అని అనుకునే వాడినో దాన్ని గురించి తెలియజెప్పడానికి ప్రయత్నించేవాణ్ణి. నేను జైల్లో వున్నప్పుడు తప్ప మిగతా కాలం 10 సంవత్సరాల పాటు అనగా 1914 వరకు నడిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రిక యొక్క ప్రతి సంచికలోను నా వ్యాసాలు ప్రచురితం అవుతూనే వున్నాయి. ఆలోచించకుండా తూకం వేసుకోకుండా వ్రాసిన ఒక్క శబ్దం కూడా ఆ పత్రికలో వెలువడలేదని చెప్పగలను. ఒకరిని సంతోష పెట్టడానికో లేక తెలిసి వుండి అతిశయోక్తులో వ్రాసినట్లు నాకు గుర్తులేదు. ఆ పత్రిక నా సంయమనానికి ఒక దృష్టాంతంగా రూపొందింది. నా భావాలకు వాహకం అయింది. నా వ్యాసాల్లో విమర్శకు ఏమీ లభించేది కాదు. ఇందు ప్రకటించబడిన వ్యాసాలు విమర్శకుల చేతుల్లో గల కలాలను చాలా వరకు అదుపులో ఉంచేవి. ఈ పత్రిక లేనిదే నత్యాగ్రహ సమరం సాగని స్థితి ఏర్పడింది. పాఠకులు ఈ పత్రికను తమదిగా భావించేవారు. సత్యాగ్రహ సంగ్రామానికి, దక్షిణ ఆఫ్రికాలో గల హిందూ దేశస్తుల పరిస్థితులకు నిజమైన చిత్తరువుగా దాన్ని భావించేవారు.

ఈ పత్రిక వల్ల రంగురంగుల మానవ స్వభావాన్ని గుర్తించేందుకు నాకు మంచి అవకాశం లభించింది. సంపాదకుడు చందాదారులు వీరిద్దరి మధ్య స్వచ్ఛమైన సంబంధం ఏర్పరచడమే మా ఉద్దేశ్యం గనుక నా దగ్గరకు హృదయం విప్పి చెప్పే పాఠకుల జాబులు కుప్పలు కుప్పలుగా వచ్చిపడేవి. తీపివి, చేదువి, కారంగా ఉండేవి, కటువుగా ఉండేవి రకరకాల జాబులు వాటిలో ఉండేవి. వాటినన్నింటినీ చదివి, వాటిలోగల భావాలను తెలుసుకొని వాటికి సమాధానాలు రాస్తూ వుండేవాణ్ణి. అది నాకు గొప్ప పాఠం అయింది. వాటిద్వారా జాతియొక్క భావాల్ని వింటున్నానా అని అనిపించేది. సంపాదకుని బాధ్యత ఏమిటో నేను బాగా తెలుసుకోసాగాను. ప్రజలమీద నాకు మంచి పట్టు లభించింది. దానివల్ల భవిష్యత్తులో ప్రారంభం కాబోతున్న పోరాటానికి శోభ చేకూరింది. శక్తి లభించింది.

ఇండియన్ ఒపీనియన్ పత్రిక వెలువడసాగిన మొదటి మాసంలోనే సమాచార పత్రిక సేవాభావంతోనే నడపబడాలని బోధపడింది. సమాచార పత్రికకు గొప్పశక్తి కలదని, స్వేచ్ఛగా, నిరంకుశంగా ప్రవహించే నీటి ప్రవాహం పొలాల్ని ముంచివేసినట్లు, పంటల్ని నాశనం చేసినట్లు కలాన్నుండి బయల్వెడలే నిరంకుశ ప్రవాహం నాశనానికి హేతువవుతుందని గ్రహించాను. ఆ అంకుశం బయటనుండి వస్తే నిరంకుశత్వం కంటే ఎక్కువ విషాక్తం అవుతుందని, లోపలి అంకుశమే లాభదాయకం అవుతుందని గ్రహించాను.