పుట:సత్యశోధన.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

253

ఈ కథ వ్రాసే సమయంలో నా దగ్గర ప్లాను అంటూ ఏమీ లేదు. ఎదురుగా పుస్తకాలు గాని, డైరీలు గాని, ఇతర పత్రాలు గాని పెట్టుకొని నేను ఈ ప్రకరణాలు వ్రాయలేదు. అంతరంగం చూపిన మార్గంలో వ్రాస్తున్నానని చెప్పగలను. నాలో సాగుతున్న క్రియను, అంతర్యామి యొక్క క్రియ అని అనవచ్చునో లేదో నిశ్చయంగా చెప్పలేను. కాని ఒక విషయం మాత్రం నిజం. ఎన్నో సంవత్సరాలనుండి నేను చేస్తున్న అతి పెద్ద పనిని అతి చిన్న పనిని పరిగణింపతగిన కార్యాలనన్నింటిని జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట అవన్నీ అంతర్యామి ప్రేరణవల్లనే జరిగాయని చెప్పగలను.

అంతర్యామిని నేను చూడలేదు. తెలుసుకోలేదు. ప్రపంచమంతటికీ భగవంతుని యెడ గల శ్రద్ధనే నేను కూడా శ్రద్ధగా మలుచుకున్నాను. ఆ శ్రద్ధ తొలగించుటకు వీలులేనిది. అందువల్ల శ్రద్ధగా దాన్ని గుర్తించడం మానుకొని దానిని అనుభవ రూపంలో గుర్తిస్తున్నాను. అయినా ఈ విధంగా అనుభవరూపంలో దాన్ని పరిచయం చేయడం కూడా సత్యం మీద పడుతున్న దెబ్బ అనే గ్రహించాలి. అసలు శుద్ధ రూపంలో దాన్ని పరిచయం చేయగల శబ్దాలు నా దగ్గర లేవని చెప్పడమే మంచిదని భావిస్తున్నాను.

కంటికి కనబడని అంతర్యామికి వశవర్తినై నేను ఈ కథ వ్రాస్తున్నానని నా విశ్వాసం. వెనుకటి ప్రకరణం ప్రారంభించినప్పుడు ‘ఇంగ్లీషు వారితో పరిచయం’ అని శీర్షిక పెట్టాను. కాని ప్రకరణం వ్రాస్తున్నప్పుడు ఈ పరిచయాల్ని వివరించే ముందు “పావనస్మృతి” ని గురించి వ్రాయాలని అనుకొని ఆ ప్రకరణం వ్రాశాను. దాన్ని వ్రాసిన తరువాత మొదటి శీర్షికను మార్చవలసి వచ్చింది.

ఇప్పుడు ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు మరో ధర్మసంకటం వచ్చిపడింది. ఇంగ్లీషు వారిని పరిచయం చేస్తున్నప్పుడు ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు. అను మహత్తరమైన ప్రశ్న ఉదయించింది. విషయం చెప్పకపోయినా సత్యానికి దెబ్బతగులుతుంది. అసలు ఈ కథ వ్రాయవలసిన అవసరమే లేదేమో. ఇట్టి స్థితిలో అప్రస్తుతమైన వివాదాన్ని పరిష్కరించేందుకు పూనుకోవడం కష్టం గదా!

చరిత్ర రూపంలో ఆత్మకథ అపూర్ణం. అందుకు సంబంధించిన ఇబ్బందుల్ని ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ‘సత్యశోధన’ యను ఈ ఆత్మకథలో నాకు జ్ఞాపకం వున్న విషయాలన్నింటిని వ్రాయడం లేదని నాకు తెలుసు. సత్యాన్ని దర్శింప చేయుటకు నేను ఎంత వ్రాయాలో ఎవరికి తెలుసు? ఒకే మార్గాన నడిచే అసంపూర్ణ ఆధారాలకు న్యాయ మందిరంలో ఎంత విలువ కట్టబడుతుందో మరి?