పుట:సత్యశోధన.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

ఇంగ్లీషు వారితో గాఢ పరిచయం

వ్రాసిన ప్రకరణలను గురించి తీరికగా వున్న వ్యక్తి ఎవరైనా నాతో తర్కానికి దిగితే నా ఈ ప్రకరణాలపై ఎంత వెలుగు ప్రసరింపచేస్తాడోగదా! అతడు విమర్శకుని దృష్టితో దీన్ని అన్వేషించి ఎటువంటి డొల్లు విషయాలు బయటపెట్టి ప్రపంచాన్ని నవ్విస్తాడో కదా? తాను కూడా ఉబ్బి తబ్బిబ్బు అవుతాడో కదా!

ఈ విధంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఈ ప్రకరణాలు వ్రాయడం ఆపివేయడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. కాని ప్రారంభించిన కార్యం అవినీతిమయమని స్పష్టంగా గోచరించనంతవరకు దాన్ని ఆపివేయకూడదు కదా! అందువల్ల అంతర్యామి నన్ను ఆపివేయమని ఆదేశించనంతవరకు ప్రకరణలు వ్రాస్తూ ఉండాలనే నిర్ణయానికి వచ్చాను.

ఈ కథ టీకాకారుల్ని తృప్తి పరచడం కోసం వ్రాయడం లేదు. ఇది సత్యశోధనకు సంబంధించిన ఒక ప్రయోగం. దీనివల్ల అనుచరులకు కొంత ఊరట కలుగుతుందను భావం కూడా ఈ రచన మూలంలో పనిచేస్తున్నది. దీని ఆరంభం కూడా వారి తృప్తి కోసమే జరిగింది. స్వామీ ఆనంద్, జయరామదాసులు నా వెంటపడి యుండకపోతే బహుశ ఈ కథ ఆరంభమై ఉండేది కాదు. అందువల్ల ఈ కథారచనలో ఏమైనా దోషాలు దొర్లితే అందుకు వారు కూడా భాగస్వాములే.

ఇక నేను శీర్షికకు వస్తాను. నేను హిందూ దేశస్తుల్ని గుమాస్తాలుగా ఇంట్లో పెట్టుకున్నట్లుగానే, ఇంగ్లీషు వాళ్ళను కూడా పెట్టుకోసాగాను. నా ఈ చర్య నా వెంట వుండే వారందరికీ పొసగేది కాదు. అయినా పట్టుబట్టి వారిని నా యింట్లో ఉంచాను. అందరినీ వుంచి నేను తెలివిగలపని చేశానని గట్టిగా చెప్పలేను. కొందరి విషయంలో చేదు అనుభవాలు కూడా కలిగాయి. అయితే ఇట్టి అనుభవాలు దేశవాసులవల్ల మరియు విదేశీయులవల్ల కలిగాయి. చేదు అనుభవాలు కలిగినందుకు నాకు పశ్చాత్తాపం కలుగలేదు. చేదు అనుభవాలు కలుగుతూ వున్నా మిత్రులకు అసౌకర్యం కలుగుతుందని తెలిసి కూడా కష్టాలు పడవలసి వస్తుందని భావించే నా అలవాటును మార్చుకోలేదు. ఉదారస్వభావంతో మిత్రులు సహించారు కూడా. క్రొత్త క్రొత్త మనుష్యుల వెంట వుండటం వల్ల, అట్టి సంబంధాల వల్ల అనుచరులకు విచారం కలిగింది. అప్పుడు వారి వారి దోషాలు వివరించి చెప్పడానికి నేను సంకోచించలేదు. ఆస్తికులగు మనుష్యులు తమలో గల భగవంతుణ్ణి సర్వులలో చూడగలిగి, అందరితోను నిర్లిప్తంగా వుండగల శక్తిని అలవర్చుకొని వుండాలని నా అభిప్రాయం. ఎక్కడ వెతకకుండా అవకాశాలు లభిస్తాయో, అక్కడ వాటికి దూరంగా పారిపోకుండా క్రొత్త క్రొత్త సంబంధాలు