పుట:సత్యశోధన.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

ఇంగ్లీషు వారితో గాఢ పరిచయం

భర్తను కాను. శిక్షకుణ్ణి కాను. ఇప్పుడు కస్తూరిబాయి తలుచుకుంటే నన్ను బెదిరించగలదు. ఇప్పుడు మేము అనుభవం గడించిన మిత్రులం. నిర్వికార భావంతో కలిసి వుంటున్నాం. యీనాడు ఆమె నేను జబ్బుపడితే ప్రయోజనం పొందాలనే కోరిక లేకుండ చాకిరీ చేసే సేవిక అన్నమాట.

పైన తెలిపిన ఘట్టం 1898 నాటిది. అప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి నాకేమీ తెలియదు. ఆరోజులెలాంటివో తెలుసా? భార్య అంటే కేవలం సహధర్మిణి, సహచారిణి. సుఖదుఃఖాలలో సహభాగిని అను విషయం నాకు తెలియని రోజులవి. విషయవాంఛల తృప్తికి భార్య సాధనమని, భర్త ఆజ్ఞను నోరు మెదపకుండ శిరసావహించునట్టి స్త్రీయే భార్య అని నేను భర్తగా భావించిన రోజులవి.

1900 నుండి నా యోచనా సరళిలో అపరిమితమైన మార్పు వచ్చింది. 1906 లో ఫలితం కనబడింది. ఈ వివరం మరో సందర్భంలో మనవి చేస్తాను. ఇక్కడ ఒక్క విషయం మాత్రం పేర్కొంటున్నాను. నేను నిర్వకారుణ్ణి అయిన కొద్దీ నాగార్హ్యస్థ్య జీవితంలో సుఖ శాంతులు నిర్మలత్వం నెలకొన్నాయి.

ఈ పావన స్మృతిని గురించి చదువుతూ ఉన్నప్పుడు మేము ఆదర్శ దంపతులమని, నా ధర్మపత్ని యందు దోషాలేమీ లేవని లేక మా ఆదర్శాలు సమానంగా వున్నాయని భావించకుందురుగాక. కస్తూరిబాయికి ఆదర్శమంటూ ఒకటుందని పాపం ఆమెకే తెలిసియుండదు. నా ఆచరణలన్నీ ఈనాడు కూడా ఆమెకు రుచిస్తాయని అనుకోను. ఈ విషయమై మేము ఎన్నడూ చర్చించలేదు. చర్చించినా ప్రయోజనం వుండదు. ఆమెకు తల్లిదండ్రులు చదువు చెప్పించలేదు. నా దగ్గరకు వచ్చిన తరువాత సరియైన సమయంలో నేను చదువు నేర్పలేదు. ఇతర హిందూ స్త్రీలవలెనే ఆమెలో కూడా ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇష్టం వున్నా లేకపోయినా, జ్ఞానంవల్ల గానీ, అజ్ఞానంవల్లగానీ నా వెంట నడచి నన్ను అనుసరించడమే తన జీవితానికి సార్థకత అని విశ్వసించింది. స్వచ్ఛజీవితం గడపవలెనని భావించి నా మార్గానికి ఎన్నడూ అడ్డు తగలలేదు. మా ఇద్దరి బౌద్ధిక శక్తులు వేరువేరుగా వున్నా మా జీవితం సంతోషంగా సుఖంగా ఊర్ధ్వపధాన ముందుకు సాగిందని చెప్పగలను.

11. ఇంగ్లీషు వారితో గాఢ పరిచయం

ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు “సత్యశోధన” అను నా ఈ గ్రంథ రచనకు గల కారణాలను, సందర్భాలను పాఠకులకు తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను.