పుట:సత్యశోధన.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

245

రోగ శయ్యమీద పడుకొని నేను వ్రాస్తున్నాను. అందువలన నా భావాల్ని తేలికగా తీసుకొని త్రోసివేయవద్దు. నా జబ్బుకు కారణం ఏమిటో నాకు తెలుసు. నా దోషాల వల్లనే నేను జబ్బుపడ్డాను. కనుకనే నేను అధైర్యపడలేదు. ఈ జబ్బు భగవంతుని అనుగ్రహంవల్ల వచ్చిందని భావిస్తున్నాను. మందులు వాడాలనే కోరికకు దూరంగా ఉన్నాను. పట్టుదలతో డాక్టర్లను ఇబ్బంది పెడుతూ ఉన్నాను. అయినా వాళ్ళు ఉదార స్వభావంతో నా మొండిపట్టును చూచి నన్ను వదిలివేయరు. నా ఈనాటి స్థితిని గురించి ఇక వ్రాయను. మనం 1904 పూర్వం నుండి 05కి వద్దాం.

ముందుకు సాగే పాఠకుల్ని ఒక్క విషయమై హెచ్చరించడం అవసరమని భావిస్తున్నాను. నా వర్ణన చదివి జుస్టు పుస్తకం తెప్పించి ఆయన వ్రాసినదంతా వేద వాక్యమని భావించకుందురుగాక. ప్రతి రచనయందు సామాన్యంగా రచయిత భావం ఒక్కటే చోటుచేసుకుంటూ ఉంటుంది. కాని ప్రతి విషయాన్ని పలు రకాలుగా పరిశీలించవచ్చు. ఆయా దృక్పథాల ప్రకారం అది సరిగానే ఉంటుంది. అయితే అన్ని దృక్పధాలు, అన్ని విషయాలు ఒకే సమయాన సత్యాలు కానేరవు. ఇంతేగాక చాలా పుస్తకాలు అమ్మకం కావాలనే భావంతోను, పేరు రావాలనే తాపత్రయంతోను వ్రాయబడుతూ ఉంటాయి. అందువల్ల ఆ పుస్తకం చదవదలచిన సోదరులు జాగ్రత్తగా చదవమనీ, ప్రయోగాలు చేయతలుచుకుంటే అనుభవజ్ఞుల సలహా సహకారాలు పొందమనీ ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ఇట్టి ప్రయోగాలకు పూనుకోమనీ మనవి చేస్తున్నాను.

8. ఒక జాగరూకత

నా వివిధ ప్రయోగాల గాధను గురించి చెప్పడం తరువాతి ప్రకరణం వరకు ఆపుతాను. గత ప్రకరణంలో మట్టి చికిత్సను గురించి వ్రాసిన విధంగానే ఆహారం విషయంలో కూడా పలు ప్రయోగాలు చేశాను. అందువల్ల అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చెప్పివేయడం అవసరమని భావిస్తున్నాను. ఆహారం విషయంలో నేను చేసిన ప్రయోగాలను గురించి, అందుకు సంబంధించిన యోచనలను గురించి పూర్తిగా ఈ ప్రకరణంలో వివరించడం సాధ్యం కాదు. ఆ విషయాలు దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం నేను వ్రాసిన వ్యాసాలు తరువాత పుస్తక రూపంలో ప్రకటించబడ్డాయి. నేను వ్రాసిన చిన్నచిన్న పుస్తకాలలో ఈ పుస్తకం పాశ్చాత్య దేశాల్లోను, మనదేశంలోను బాగా ప్రసిద్ధికెక్కింది. అందుకు కారణం ఏమిటో