పుట:సత్యశోధన.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

మాంసరహిత ఆహారం కోసం బలిదానం

గంటలకు ముందు లేచేవాణ్ణి కాదు. నేను కూడా ఉదయం టిఫెను మానేస్తే మంచిదనీ, తలనొప్పి తగ్గవచ్చుననీ నిర్ణయానికి వచ్చాను. ఉదయం టిఫెసు మానివేశాను. కొద్దిరోజులు బాధ కలిగింది. కాని తత్ఫలితంగా తలనొప్పి తగ్గిపోయింది. దానితో నేను అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నానని తేలిపోయింది.

విరోచనాలు తగ్గలేదు. కూనే తెలిపిన ప్రకారం కటిస్నానం మొదలు పెట్టాను. బాధ కొద్దిగా తగ్గింది. కాని పూర్తిగా తగ్గలేదు. ఈ లోపున ఆ జర్మనీ హోటలువాడో మరో మిత్రుడో, జుస్ట్ రచించిన “రిటర్న్ టు నేచర్” (ప్రకృతి వైపు మరలుము) అను పుస్తకం నా చేతికి ఇచ్చారు. అందు మట్టి చికిత్సను గురించిన వివరం చదివాను. ఎండుద్రాక్ష వగైరా పండ్లు, ఆకుపచ్చని పండ్లు మనిషికి ప్రాకృతిక ఆహారమని కూడా వ్రాసి ఉన్నది. పండ్లను గురించిన ప్రయోగం అప్పుడు నేను చేయలేదు కాని మట్టి చికిత్స వెంటనే ప్రారంభించాను. ప్రయోజనం కలిగింది. పరిశుభ్రమైన, పొలంలో దొరికే ఎర్రని లేక నల్లని మట్టి తెచ్చి అందు సరిపోయేలా నీళ్ళుపోసి కలిపి, పల్చటి తడి బట్టమీద దానివేసి చుట్టి పొట్టమీద ఉంచాను. దాని మీద పట్టీ కట్టాను. ఆ విధంగా మట్టిపట్టి రాత్రి నిద్రపోయే ముందు కట్టి, ప్రొద్దునగాని లేక రాత్రి మెలకువ వచ్చినప్పుడు గాని విప్పదీసేవాణ్ణి. దానివల్ల విరోచనాలు కట్టుకున్నాయి. ఈ విధమైన మట్టి చికిత్స నా అనుచరులకు కూడ చాలాసార్లు చేశాను. అది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని నాకు ఇప్పటికీ జ్ఞాపకం.

భారతదేశం వచ్చాక ఇలాంటి చికిత్సలను గురించిన ఆత్మ విశ్వాసం తగ్గిపోయింది. ప్రయోగాలు చేసేందుకు ఒకచోట కూర్చునేందుకు సమయమే దొరకలేదు. అయితే ఇట్టి చికిత్స యెడ నాకు గల శ్రద్ధాసక్తులు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. సమయాన్ని బట్టి అప్పుడప్పుడు మట్టి చికిత్స నేను చేసుకోవడమేగాక నా అనుచరులకు కూడా చేస్తున్నాను. రెండు పర్యాయాలు నేను బాగా జబ్బు పడ్డాను. అయినా మందులు పుచ్చుకోవలసిన అవసరం లేదనే భావించాను. పత్యం, నీరు, మట్టి మొదలుగాగల చికిత్సతో వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది జబ్బులు నయం చేయవచ్చునని నా విశ్వాసం.

క్షణక్షణం డాక్టర్ల దగ్గరికీ, వైద్యుల దగ్గరికీ, హకీములదగ్గరికీ పరుగెత్తుతూ, ఉదరంలో రకరకాల బెరుళ్ళు, ఆకులు మొదలగువాటి రసాయనం పోసి పోసి మనిషి తన జీవితాన్ని తానే కుంచించుకుంటూ ఉన్నాడు. అంతేగాక మనస్సుమీద అతనికి గల పట్టు తప్పుతున్నది. దానితో అతడు మానవత్వం పోగొట్టుకుంటున్నాడు. శరీరానికి బానిస అయిపోతున్నాడు.