పుట:సత్యశోధన.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

239

అందువల్ల నా వల్ల కొద్ది సాయం పొందాలని వారి అభిలాష. “నిరస్తపాదపే దేశే ఎరండోపి ద్రుమాయతే” చెట్టులేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అను సామెత వలె నా పరిస్థితి వున్నది. ఒక మిత్రునితో కలిసి వివేకానందుని గ్రంధాలు, మరొకరితో కలిసి మణిలాల్ భాయీ రచించిన రాజయోగం చదవడం ప్రారంభించాను. జిజ్ఞాస మండలి అను పేరిట ఒక సమితిని స్థాపించి నియమబద్ధంగా అధ్యయన కార్యక్రమం ప్రారంభించాం. భగవద్గీత అంటే మొదటినుండి నాకు ఎంతో ప్రేమ, శ్రద్ధ. లోతుకుపోయి గీతాధ్యయనం చేయాలనే కోరిక కలిగింది. నా దగ్గర గీతానువాదాలు రెండు మూడు వున్నాయి.

వాటి ద్వారా సంస్కృత గీతను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టి ప్రతిరోజు ఒకటి రెండు శ్లోకాలు కంఠస్థం చేయాలని నిశ్చయించుకున్నాను.

ఉదయం ముఖం కడుక్కునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు గీతాశ్లోకాలు కంఠస్థం చేయసాగాను. దంతధావనకు 15 నిమిషాలు, స్నానానికి 20 నిమిషాలు పట్టేది. దంతధావనం ఆంగ్లేయుల పద్ధతిలో నిలబడి చేసేవాణ్ణి. ఎదురుగా వున్న గోడమీద గీతాశ్లోకాలు వ్రాసి అంటించి సమయం దొరికినప్పుడల్లా వాటిని బట్టీవేయసాగాను. బట్టీ వేసిన సంస్కృత శ్లోకాలు స్నానం చేసేసరికి నోటికి వచ్చేసివి. ఈ సమయంలోనే మొదటి నుండీ బట్టీ బట్టిన శ్లోకాల్ని తిరిగి పఠించి నెమరవేసుకునేవాణ్ణి. ఈ విధంగా 13 అధ్యాయాలు కంఠస్థం చేసిన సంగతి నాకు గుర్తు ఉంది. తరువాత నాకు ఇతర పని పెరిగింది. సత్యాగ్రహ కార్యక్రమం ప్రారభించిన తరువాత ఆ బిడ్డ పెంపకం, పోషణలో పడిపోయి ఆలోచించడానికి కూడా సమయం చిక్కడం దుర్లభం అయింది.

ఇప్పటికీ అదే స్థితి అని చెప్పవచ్చు. గీతాధ్యయనం వల్ల నాతో కలిసి చదువుతున్నవారి మీద ఏం ప్రభావం పడిందో తెలియదు కాని నాకు మాత్రం ఆ పుస్తకం ఆచారానికి సంబంధించిన ప్రౌఢ మార్గసూచిక అయిందని చెప్పగలను. అది నాకు ధార్మిక నిఘంటువు అయింది. క్రొత్త ఇంగ్లీషు శబ్దాల స్పెల్లింగు లేక వాటి అర్థం తెలుసుకునేందుకు ఇంగ్లీషు నిఘంటువును చూచినట్లే ఆచరణకు సంబధించిన కష్టాలు, కొరుకుడుపడని సమస్యలు వచ్చినప్పుడు గీతద్వారా వాటి పరిష్కారం చేసుకునేవాణ్ణి. అపరిగ్రహం, సమభావం మొదలైన అందలి శబ్దాలు నన్ను ఆకట్టుకున్నాయి. సమభావాన్ని ఎలా సాధించాలి? దాన్ని ఎలా సంరక్షించాలి? అవమానించే అధికారులు, లంచాలు పుచ్చుకునే అధికారులు, అనవసరంగా