పుట:సత్యశోధన.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

నిరీక్షణకు ఫలితం

ఈ విధమైన భావనాస్రవంతి ప్రారంభమైంది. వెంటనే ఆచరణలో పెట్టలేకపోయాను. భీమాకు చెల్లించవలసిన సొమ్ము ఒక్క పర్యాయం దక్షిణ ఆఫ్రికా నుండి పంపించినట్లు గుర్తు. ఈ విధమైన భావానికి బయటనుండి కూడా ఉత్తేజం లభించింది. మొదటిసారి దక్షిణ ఆఫ్రికాకు వచ్చినప్పుడు క్రైస్తవ వాతావరణ ప్రభావం వల్ల మత విషయంలో జాగరూకుడనయ్యాను. ఈసారి దివ్య జ్ఞాన సమాజ ప్రభావంలో పడ్డాను. మి.రీచ్ ధియాసోఫిస్టు. జోహాన్సుబర్గునందున్న ఆయన సొసైటీతో నాకు సంబంధం కల్పించాడు. అయితే నేను అందు మెంబరుగా చేరలేదు. దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాల విషయంలో నాకు అభిప్రాయభేదం ఉంది. అయినా సదరు సొసైటీ సభ్యులందరితో నాకు గాఢంగా పరిచయం ఏర్పడింది. వారితో నిత్యము మతపరంగా చర్చ జరుగుతూ వుండేది. వారి పుస్తకాలు చదివేవాణ్ణి. వారి సభల్లో మాట్లాడే అవకాశం కూడా లభిస్తూ ఉండేది. దివ్యజ్ఞాన సమాజంలో భ్రాతృభావానికీ, దాని పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమై మేము బాగా చర్చ చేస్తూ వుండేవాళ్ళం. వారి సిద్ధాంతానికి, సొసైటీ సభ్యుల ఆచరణకీ పొంతన కనపడకపోతే తీవ్రంగా విమర్శించేవాణ్ణి. ఈ విమర్శ యొక్క ప్రభావం నా మీద కూడా బాగా పడింది. నేను ఆత్మ నిరీక్షణ చేసుకోవడం నేర్చుకున్నాను.

5. నిరీక్షణకు ఫలితం

క్రీస్తుశకం 1893లో క్రైస్తవ మిత్రులతో పరిచయం పెరిగిన సమయంలో నేను జిజ్ఞాసువు స్థాయిలో వున్నాను. క్రైస్తవ మిత్రులు బైబిలు సందేశం నాకు వినిపించి వివరించి చెప్పి నా చేత అంగీకరింపచేయాలని ప్రయత్నిస్తూ వుండేవారు. నేను వినమ్రతతో తటస్థభావం వహించి వారి ఉపదేశాలను వింటూ వుండేవాణ్ణి. ఆ సందర్భంలో నేను హిందూ మతాన్ని గురించి శక్త్యానుసారం అధ్యయనం చేశాను. ఇతర మతాల్ని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు అనగా 1903లో పరిస్థితి మారింది. దివ్యజ్ఞాన సమాజం మిత్రులు నన్ను తమ సమాజంలో చేర్చుకుందామని ఉవ్విళ్లూరుతున్నారు. హిందువుగా నా ద్వారా ఏదో కొంత చేయించాలని వాళ్ళ అభిలాష. దివ్యజ్ఞాన పుస్తకాల్లో హిందూ మతచ్ఛాయలే ఎక్కువ. అందువల్ల నేను ఎక్కువగా సహకరిస్తానని అనుకున్నారు. సంస్కృత అధ్యయనం నేను చేయలేదు. ప్రాచీన హిందూమత గ్రంథాలు సంస్కృతంలో నేను చదవలేదు. అనువాదాలు కూడా చదివింది తక్కువే అని చెప్పాను. అయినా వాళ్ళు సంస్కారాల్ని, పునర్జన్మను అంగీకరిస్తారు.