పుట:సత్యశోధన.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

235

స్థితి దుర్భరంగా ఉంది. మీరు మి. చేంబర్లేను దగ్గరికి వెళ్ళకపోతే ఇక్కడ మనవాళ్ళకేమీ కష్టం లేదని ప్రకటిస్తారు. అందువల్ల ఏది ఏమైనా చెప్పదలుచుకున్నది లిఖితంగా చెప్పవలసిందే. అది వ్రాసి సిద్ధంగా ఉన్నది. నేను చదివినా, మరెవరు చదివినా ఒకటే. మి. చేంబర్లేన్ దీన్ని గురించి చర్చించడు. నాకు జరిగిన అవమానాన్ని మనం సహించవలసిందే అని నేను చెబుతూ వుండగా తయ్యబ్ సేఠ్ అందుకొని ‘మీ అవమానం జాతికే అవమానం. మీరు మా ప్రతినిధులు. దీన్ని ఎలా మరచిపోవడం?’ అని అన్నాడు.

“నిజమే. కాని జాతికూడా ఇటువంటి అవమానాల్ని సహించవలసిందే. మరో ఉపాయం ఏమీ లేదు” అని నేను అన్నాను. తయ్యబ్‌సేఠ్ “అయిందేదో అయింది. కావలసింది అయి తీరుతుంది. మేము చేతులారా మరో అవమానానికి గురికాము. మన పనులు ఎలాగూ చెడుతున్నాయి. మనకేమైనా హక్కులు లభించనున్నాయా? లేదే!” అని అన్నాడు.

ఈ ఆవేశం నా దృష్టిలో సరియైనదే. కాని దానివల్ల లాభం లేదని నాకు తెలుసు. జాతికి అవమానం జరుగుతున్నదని నాకు తెలియదా? అందువల్ల వారందరినీ శాంతపరిచాను. నా పక్షాన హిందూ దేశపు బారిష్టర్ కీ.శే. జార్జిగాడ్‌ఫ్రేను వెళ్ళమని చెప్పాను. అంతా అంగీకరించారు. ఈ విధంగా మి. గాడ్‌ఫ్రే డెపుటేషన్‌కు నాయకత్వం వహించారు. మాటల సందర్భంలో చేంబర్లేన్ నా విషయం కొద్దిగా పేర్కొన్నాడట. “ఒకే మనిషిని మాటిమాటికి వినేకంటే క్రొత్తవారిని వినడం ఎక్కువ మంచిది” మొదలుగా గల మాటలు పలికి తగిలిన గాయాన్ని కొద్దిగా మాన్చడానికి ప్రయత్నించాడట.

దీనివల్ల జాతిపని, నా పని కూడా బాగా పెరిగిపోయింది. మళ్ళీ మొదటినుండి ప్రారంభించవలసి వచ్చింది. “మీరు చెప్పినందువల్ల జాతి అంతా యుద్ధంలో పాల్గొన్నది. కాని ఫలితం ఇదేగదా?” అని ఎత్తిపొడిచేవాళ్ళు కూడా బయలుదేరారు. అయితే ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు నా మీద పనిచేయలేదు. “నేను అట్టి సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాపపడటం లేదు. యుద్ధంలో పాల్గొని మనం మంచి పనే చేశాము. ఇవాళ కూడా నా అభిప్రాయం అదే. ఆ విధంగా చేసి మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాం. దాని సత్ఫలితం మనం చూడలేకపోతే పోవచ్చు. కాని మంచి పనికి ఎప్పుడూ మంచి ఫలితమే కలుగుతుంది. ఇది నా దృఢ విశ్వాసం. గతంలో ఏం జరిగింది అని ఆలోచించకుండా ఇక భవిష్యత్తులో ఏం చేయాలి అని మనం యోచించాలి. ఇది మన కర్తవ్యం” అని చెప్పాను. నా మాటలు విని అందరూ నన్ను సమర్థించారు.