పుట:సత్యశోధన.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

చేదు గుటకలు

తయ్యబ్ సేఠ్ తన తెలివితేటల్ని ఉపయోగించి “మీరు వున్నారు. కాని గాంధీ గారు మా మనిషి గదా! ఆయనకు మా భాష వచ్చు. ఆయన మమ్మల్ని ఎరుగును. పైగా మీరు అధికారులు” అని అన్నాడు.

“గాంధీని నా దగ్గరకు తీసుకురండి” అని ఆదేశించాడు ఆ అధికారి.

తయ్యబ్ సేఠ్ మొదలగువారితో బాటు నేను అక్కడికి వెళ్ళాను. కూర్చోవడానికి కుర్చీ లభించలేదు. మేమంతా నిలబడే ఉన్నాము. దొర నావంక చూచాడు. చెప్పండి! మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు.

“నా సోదరులు పిలిచినందున వారికి సలహా ఇచ్చేందుకు వచ్చాను” అని జవాబిచ్చాను.

“ఇక్కడకు రావడానికి మీకు అధికారంలేదని తెలియదా? పొరపాటున మీకు అనుమతి పత్రం లభించింది. మీరు ఇక్కడి నివాసస్థులుగా పరిగణించబడరు. మీరు తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. మీరు మి. చేంబర్లేన్ దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడి హిందూ దేశస్తుల రక్షణ కోసం మా విభాగం ప్రత్యేకించి ఏర్పాటు చేయబడింది మంచిది. ఇక వెళ్ళండి” అని దొర నన్ను పంపించి వేశాడు. సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వలేదు.

ఇతర అనుచరులను ఆపి ఉంచాడు. వారిని బెదిరించాడు. నన్ను తక్షణం ట్రాన్సువాలు నుండి పంపివేయమని వాళ్ళకు సలహా ఇచ్చాడు.

అనుచరులు ముఖం వ్రేలాడేసుకొని వచ్చారు. ఊహించని ఒక క్రొత్త సమస్యను ఎదుర్కొని దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.

3. చేదు గుటకలు

ఈ అవమానం వల్ల నాకు దుఃఖం కలిగింది. అయితే ఇంతకు పూర్వం ఇటువంటి అనేక అవమానాలు భరించివున్నాను. అందువల్ల నాకు అవి అలవాటయ్యాయి. కనుక అవమానాన్ని లక్ష్యం చేయకుండా తటస్థభావంతో వుండి కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.

ఆ అధికారి సంతకంతో ఒక పత్రం వచ్చింది. మి. చేంబర్లేన్ డర్బనులో మి. గాంధీని కలుసుకున్నారు. అందువల్ల ఆయన పేరు ప్రతినిధుల పట్టికనుంచి తొలగించవలసివచ్చింది అని ఆ పత్రంలో వ్రాసి ఉన్నది.

అనుచరులకు ఈ పత్రం వల్ల భరించలేనంత బాధ కలిగింది. అయితే అసలు మేము డెపుటేషనే తీసుకువెళ్ళం” అని అన్నారు. నేను వారికి నచ్చచెప్పాను. మనవాళ్ళ