పుట:సత్యశోధన.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

231

యుద్ధం ముగిశాక ట్రాన్సువాలు శిథిలమైపోయింది. అక్కడ తినడానికి తిండిగాని కట్టడానికి బట్టగాని లేదు. ఖాళీగా మూసిపడివున్న దుకాణాలను తెరిపించాలి. నింపాలి. ఇది నెమ్మదిగా జరుగవలసిన కార్యక్రమం. సామాను లభించేదాన్ని బట్టి ఇళ్ళు వదలిపారిపోయిన వాళ్ళనందరినీ తిరిగివచ్చేలా చూడాలి. అందు నిమిత్తం ప్రతి ట్రాన్సువాలు నివాసి, అనుమతి పత్రం తీసుకోవాలి. తెల్లవాళ్ళకు అడగంగానే అనుమతి పత్రం లభిస్తుంది. కాని హిందూ దేశస్తులకు లభించదు. యుద్ధ సమయంలో హిందూ దేశాన్నుండి, లంకనుండి చాలామంది ఆఫీసర్లు, సైనికులు దక్షిణాఫ్రికా వచ్చారు. వారిలో అక్కడ ఉండదలచిన వారికి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత బ్రిటీష్ ప్రభుత్వ అధికారులది. అది వారి కర్తవ్యంగా భావించబడింది. క్రొత్త అధికారుల కమిటీలు ఏర్పాటు చేయాలి. అందు అనుభవం కలిగిన అధికారులకు తేలికగా స్థానం లభించింది. ఈ అధికారుల తీవ్ర బుద్ధి మరో క్రొత్త విభాగాన్ని నెలకొల్పింది. దానివల్ల వారికే ఎక్కువ స్తోమతు లభించడం సహజం. హబ్షీలకోసం వేరే విభాగం ఏర్పాటు చేశారు. ఇక ఆసియా వాసుల కోసం ఏర్పాటు చేయరా? తర్కం సరిగా వున్నందున అంగీకారం లభించింది. అయితే నేను అక్కడకు చేరేసరికి ఈ ఏర్పాటు జరిగిపోయింది. మెల్లమెల్లగా వల పన్నారు. పారిపోయిన వాళ్ళకు అనుమతి పత్రం ఇస్తున్న అధికారి ఇష్టపడితే అందరికీ ఇవ్వవచ్చు. కాని ఫలానా వాడు ఆసియా వాసి అని అతడికి తెలియడం ఎలా? ఈ క్రొత్త విభాగం సిఫారసు చేస్తే ఆసియా వారికి అనుమతి పత్రం లభించితే ఆ అధికారి బాధ్యత తగ్గుతుంది. అతడి మీద పని బరువు కూడా తగ్గుతుంది. ఈ తర్కం క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశ పెట్టబడింది. కాని క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశ పెట్టబడింది. కాని క్రొత్త విభాగం వారికి పనితోబాటు సొమ్ముకూడ కావలసి వచ్చింది. పనిలేకపోతే ఈ విభాగం అవసరం లేదని చెప్పి దాన్ని మూసివేస్తారు. అందువల్ల ఆ విభాగానికి పని అప్పజెప్పబడింది.

ఆ విభాగానికి వెళ్ళి హిందూ దేశస్థులు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలారోజుల తరువాత జవాబు వస్తుంది. ట్రాన్సువాలు వెళ్ళగోరే వారి సంఖ్య ఎక్కువగా వుంది. అందువల్ల దళారులు బయలుదేరారు. ఈ దళారులకు అధికారులకు మధ్య బీద హిందూదేశస్థుల వేలాది రూపాయలు స్వాహా అవుతున్నాయి. సొమ్ము ఇచ్చి గట్టి ప్రయత్నం చేయకపోతే అనుమతి పత్రం లభించడం లేదని చాలా మంది నాకు చెప్పారు. అవకాశం ఉన్నప్పటికీ ఒక్కొక్క మనిషి అనుమతి పత్రం కోసం వంద పౌండ్లు కూడా చెల్లించవలసిన స్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో నా కర్తవ్యం ఏమిటి?