పుట:సత్యశోధన.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ భాగం

1. చేసిన కృషి వ్యర్థం

మి.చేంబర్లేన్ మూడున్నర కోట్ల పౌండ్లు దక్షిణ ఆఫ్రికా దగ్గర తీసుకుందామని వచ్చాడు. ఇంగ్లీషువాళ్ళ, సాధ్యమైతే బోయర్ల మనస్సును కూడా జయించాలని ఆయన భావం. అందువల్ల భారతీయ ప్రతినిధులకు వ్యతిరేక సమాధానం వచ్చింది.

“స్వరాజ్యం అనుభవిస్తున్న అధినివేశరాజ్యాల మీద ఆంగ్ల సామ్రాజ్య ప్రభుత్వానికి గల అధికారం బహు స్వల్పమను విషయం మీరు ఎరుగుదురు. మీ ఆరోపణలు యదార్థమైనవనే తోస్తున్నది. నా చేతనైనంతవరకు మీకు సాయం చేస్తాను. మీరు మాత్రం అక్కడి తెల్లవారికి తృప్తి కలిగించాలి. వాళ్ళను సంతోషపరచాలి.” ఇదీ వారి సమాధానం.

ఈ సమాధానం వల్ల భారత ప్రతినిధి వర్గం మీద పిడుగు పడినంతపని అయింది. నాకు గల ఆశ పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడే తెల్లవారిందని భావించి “ఏమండీ! ఆశీర్వదించండి” అంటూ పని ప్రారంభించాలన్న మాట. అనుచరులందరికీ ఈ విషయం నచ్చ చెప్పాను.

అయితే చేంబర్లేన్ సమాధానం అనుచితమైనదా? తారుమారు చేసి మాట్లాడకుండా ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాడు. నోరు ఉన్న వాడిదే రాజ్యమని ఆయన తీయని మాటల్లో చెప్పాడన్నమాట. అసలు మా దగ్గర నోరనేది వుంటే గదా! నోటి తూటాల తాకిడికి తట్టుకోగల శరీరాలు కూడా మాకు లేవు. మి. చేంబర్లేన్ కొద్ది వారాలు మాత్రమే ఉంటారని తెలిసింది. దక్షిణాఫ్రికా చిన్న ప్రాంతం కాదు. ఇదొక దేశం, ఇదొక ఖండం, ఆఫ్రికాలో ఆనేక ఉపఖండాలు వున్నాయి. కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు 1800 మైళ్ళు ఉంటే, డర్బన్ నుండి కేప్‌టౌన్ వరకు 1100 మైళ్ళకు తక్కువ లేదు. ఈ ఖండంలో మి. చేంబర్లేన్ తుపాను పర్యటన జరపాలి. ఆయన ట్రాన్సువాలుకు బయలుదేరాడు. హిందూ దేశస్థుల కేసును తయారు చేసి నేను వారికి అందజేయాలి. ప్రిటోరియా ఎలా చేరడం? నేను సమయానికి చేరాలి, అనుమతి తీసుకోవాలి అంటే మనవాళ్ళ వల్ల అయ్యే పనికాదు.

230