పుట:సత్యశోధన.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

225

డాక్టరును పిలిపించాను. “ఇందుకు మందు పనిచేయదు. కోడిగుడ్లరసం, కోళ్ళరసం ఇవ్వాలి” అని డాక్టరు చెప్పాడు.

మణిలాలు వయస్సు పదిఏళ్ళు. పిల్లవాణ్ణి ఏమని అడగను? సంరక్షకుణ్ణి నేను. నేనే ఏదో ఒక నిర్ణయం చేయాలి. డాక్టరు సజ్జనుడు. పారసీకుడు “అయ్యా, మేము మాంసాహారులం కాము. మీరు చెప్పిన ఈ రెండు వస్తువుల్లో దేన్నీ ముట్టము. ఇందుకు బదులు మరొకటి చెప్పండి.” అని అన్నాను.

“మీ పిల్లవాడి జీవితాశలేదు. పాలలో నీళ్ళు కలిపి ఇవ్వవచ్చు. కాని ఆ ఆహారం చాలదు. నేను చాలామంది హిందువుల ఇళ్ళల్లో వైద్యం చేస్తున్నాను. మీకు తెలుసు. వాళ్ళంతా నే చెప్పినట్లు చేస్తారు. నేను చెప్పిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నారు. నేను చెప్పినట్లు మీరు కూడా విని ఈ పిల్లవాడి విషయంలో కాఠిన్యం వహించకుండా వుంటే మేలు జరుగుతుంది.

మీరన్నది నిజమే. కాని ఒక్క విషయం చెప్పక తప్పదు. ఈ విషయంలో నా బాధ్యత చాలా ఎక్కువ. అతడు పెద్ద వాడైయుంటే అతడి ఇష్టానుసారం వ్యవహరించి వుండేవాణ్ణి. కాని ఆ భారం నా మీద పడింది. మనిషికి ధర్మసంకటం ఏర్పడేది ఇలాంటి సమయాల్లోనేనని భావిస్తున్నాను. తప్పో ఒప్పో మనుష్యుడు మాంసం తినకూడదని నా నిర్ణయం. జీవన సాధనానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రాణం నిలుపుకోడం కోసమైనా ఈ వస్తువుల్ని తినరాదని నా అభిప్రాయం. అందువల్ల నాకు గాని నావారికి గాని ఇట్టి సమయంలో కూడా మాంసం మొదలగు వాటిని తినిపించకూడదని నా ధర్మమర్యాద బోధిస్తున్నది. మీరు ఈ పిల్లవాడి జీవితానికి ప్రమాదం అని చెప్పినా లేక నిజంగా ప్రమాదం సంభవించినా నేను వాటిని ముట్టను. కాని ఒక్కటి మాత్రం యాచిస్తున్నాను. మీ మందులు నేను వాడను. నాకు నాడి, హృదయ పరీక్ష తెలియదు. నాకు కొంచెం కొంచెం జల చికిత్స తెలుసు. నేనా చికిత్స చేస్తాను. మీరు నియమప్రకారం మణిలాలును చూచి శరీరంలో కలిగే మార్పుల్ని నాకు తెలిపితే మీ మేలు మరువలేను అని అన్నాను. సజ్జనుడగు అతనికి నా ఇబ్బంది తెలిసింది. నేను కోరిన ప్రకారం వచ్చి మణిలాలును చూచి వెళతానని అన్నాడు.

మణిలాలు తన ఉద్దేశ్యం నిర్ధారించి చెప్పగలవాడు కాకపోయినా, నాకు డాక్టరుకు జరిగిన సంభాషణంతా చెప్పి నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాను.

“నీవు మామూలుగా జలవైద్యం చేయి. నాకు కోళ్ళూ వద్దు, కోడిగ్రుడ్లరసమూ వద్దు” అని మణిలాలు అన్నాడు.