పుట:సత్యశోధన.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

ధర్మసంకటం

బాబూ, వాటిని తిను అని నేను చెబితే పిల్లవాడు తింటాడని నాకు తెలుసు. అయినా అతని మాటలవల్ల నాకు సంతోషం కలిగింది. నాకు కూనే వైద్యం కొద్దిగా తెలుసు. లోగడ నుండి ఈ వైద్యం నేను చేస్తున్నాను. రోగానికి లంకణం పరమౌషధం అని నా భావం. కూనే వైద్యం ప్రకారం మణిలాలుకు కటిస్నానం మూడు నిమిషాలు మాత్రం చేయించాను. మూడు రోజుల వరకు నీరు కలిపిన నారింజ పండ్ల రసం ఇచ్చాను. కాని ఉష్ణం తగ్గలేదు. రాత్రిళ్ళు కొంచెం కొంచెం పెరుగుతూ వున్నది. 104 డిగ్రీల దాక జ్వరం వుంటున్నది. నాకు కంగారు పుట్టింది. “పిల్లవాడికి ఏమైనా అయితే లోకులేమంటారు? మా అన్నగారేమంటారు? మరో డాక్టరును పిలిపించకూడదా? ఆయుర్వేద వైద్యుణ్ణి పిలిపించకూడదా? అపక్వమైన తమ బుద్ధిని పిల్లలపై ప్రయోగించే హక్కు తల్లిదండ్రుల కెక్కడిది? ఈ రకమైన ఊహలతో మనుస్సు బరువెక్కింది ‘జీవుడా! నీవు నీకోసం ఏంచేస్తున్నావో నీ పిల్లవాడి కోసం కూడా అదే చేయి. పరమేశ్వరుడు సంతోషిస్తాడు. నీకు జలచికిత్స అంటే గురి. మందు మీద అట్టి గురి లేదు. డాక్టరు ప్రాణం పోయలేడు. అతడిచ్చేది మందు. ప్రాణతంతువు దేవుడి చేతుల్లో వుంది. అందువల్ల దైవనామం స్మరించు. దానిని నమ్ము. నీ మార్గం విడవకు’ అను ఊహ మనస్సులో జనించింది.

మనస్సులో ఎంతో మధనపడుతూ వున్నాను. చీకటి పడింది. రాత్రి మణిలాలును దగ్గరకు తీసుకొని పడుకున్నాను. తడిగుడ్డ కప్పవచ్చని అనుకున్నాను. లేచి బట్ట తెచ్చి చన్నీటిలో తడిపి పిడిచి తలవరకు కప్పాను. పైన రెండు కంబళ్ళు, కప్పాను. తలకు తడితువాలు చుట్టాను. ఒళ్ళు పెనంలా కాలుతున్నది. వంటి మీద చెమట బొట్టు లేదు.

నాకు దడ పుట్టింది. మణిలాలును తల్లికి అప్పగించాను. ఒక్క అరగంట సేపు తెరపగాలిలో తిరిగి శ్రమ తీర్చుకొని శాంతి పొందుదామని తలచి చౌపాటి వైపుకు వెళ్ళాను. పదోగంట కొట్టారు. మనుష్యుల రాక పోకలు తగ్గాయి. కాని నాకు ఆదేమీ తెలియదు. నేను దుఃఖ సాగరంలో మునిగి వున్నాను. “ఓ ఈశ్వరా! ఈ ధర్మ సంకటంలో నా ప్రార్ధన అంగీకరించు” అని అంటూ నిలబడ్డాను. నా నాలుక మీద రామనామం ఆడుతూ వుంది. కొంత సేపటికి ఇంటికి బయలుదేరాను. నా గుండెలు దడదడలాడుతూ వున్నాయి. ఇంట్లో ప్రవేశించాను. “నాన్నా! వచ్చావా?” అని మణిలాలు అన్నాడు.