పుట:సత్యశోధన.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

ధర్మసంకటం

దొర తాను చేస్తున్నది ఒప్పే అనుకొని అలా చేస్తున్నాడను విషయం నిజం. కాని నల్లవాళ్లు పడుతున్న ఇబ్బందుల ముందు అది ఏపాటిది? ఆయనకు బీదవారగు నల్లవారి అవసరాలు, అలవాట్లు, స్వభావాలు, ఆచారాలు ఎట్లా తెలుస్తాయి? రూపాయల మీద నడిచే వాడికి పైసల సంగతి ఎలా తెలుస్తుంది! ఎంత ప్రయత్నించినా ఏనుగు చీమను గురించి తెలుసుకోలేదు. అదే విధంగా ఏనుగులవంటి తెల్లవాళ్ళు చీమలాంటి నల్లవాళ్లను తెలుసుకోవాలన్నా వాళ్ళను తీర్చిదిద్దాలన్నా సాధ్యం కాదు.

ఇక స్వవిషయం. పైన తెలిపిన విధంగా నామీద నాకు విశ్వాసం కలిగింది. కొంతకాలం రాజకోటలోనే వుందామని భావించాను. ఇంతలో కేవలరాంగారు నా దగ్గరకు వచ్చి “నిన్నిక్కడ వుండనీయను. నీవు యిక బొంబాయిలో వుండవలసి వస్తుంది.” అని అన్నాడు.

“అయితే అక్కడ కేసులేవీ? నా ఖర్చు మీరు భరిస్తారా!”

“అహా, నీ ఖర్చులు నేను భరిస్తాను. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద బారిస్టర్లను ఇక్కడికి తీసుకువచ్చినట్లు నిన్ను తీసుకు వస్తాను. వ్రాతకోతల పనులన్నీ అక్కడికి పంపిస్తాను. బారిస్టర్లను పెద్దవాళ్ళను చేయడం, చిన్నవాళ్ళను చేయడం ప్లీడర్ల చేతిలో పని కాదా! జాంనగర్‌లోసు, వేరావలులోను నీ పనిని సరిగ్గా నిర్వహించావు. ఇక మాకు చింత లేదు. లోకారాధన చేయవలసిన వాడవు. ఇక నిన్ను కాఠియావాడులో వుండనీయం. ప్రయాణం ఎప్పుడో చెప్పు.”

“నేటాలునుండి నాకు కొంత పైకం రావాలి. అది రాగానే నేను బొంబాయి వెళతాను”

పైకం రెండు వారాల్లో వచ్చింది. నేను బొంబాయి వెళ్ళాను “ఫేయిన్ గిల్ బర్టు అండ్ సయానీస్" అను ఆఫీసులో చేంబరు అద్దెకు తీసుకొని అక్కడే బసచేశాను.

22. ధర్మసంకటం

నేను ఆఫీసుతో పాటు గిరిగాములో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. కాని ఈశ్వరుడు నన్ను స్థిరంగా వుండనీయలేదు. ఇల్లు తీసుకున్న కొద్దిరోజులకే మా రెండో పిల్లవాడికి బాగా జబ్బు చేసింది. టైఫాయిడ్ జ్వరం. ఎంతకీ తగ్గలేదు. మాటలు తడబడడం ప్రారంభమైంది. రాత్రి సన్నిపాత లక్షణాలు. ఈ వ్యాధికి ముందు అతనికి మశూచి ముమ్మరంగా పోసింది.