పుట:సత్యశోధన.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

221

ధ్యానానికి, భగవచ్చింతనకు అది నిలయం. అలాంటి చోట వాటికే తావు లేదు. అయితే తమ చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో లీనమైయున్న కొంతమంది స్త్రీలను నేను చూచాను. అందుకు ఆలయ అధికారుల్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఆలయ ప్రాంతం శాంతంగా, నిర్మలంగా, సుగంధితంగా ఉంచడం ఆలయ అధికారుల విది. నేనక్కడ మోసపువర్తకులు రెండోరకం మిఠాయి అమ్ముతూ వుండటం చూచాను.

ఆలయంలో అడుగు పెట్టేసరికి గుమ్మంలో కుళ్ళిన పూలు కనబడ్డాయి. వాటినుండి దుర్గంధం వస్తూవుంది. లోపల నేలమీద చలువ రాళ్ళు పరచబడి వున్నాయి. ఆ చలవరాళ్ల మీద అంధభక్తుడొకడు రూపాయలు తాపింపచేశాడు. దానిలోకి మురికి దూరి స్థావరం ఏర్పరుచుకుంది.

‘జ్ఞానవాసి’ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఈశ్వరుడి కోసం వెతికాను. కాని వృధా. అక్కడ నా మనస్సు బాగుండలేదు. జ్ఞానవాసి దగ్గరకూడా అంతా చెడుగే. దక్షిణ యిచ్చేందుకు బుద్ధిపుట్టలేదు. అందువల్ల ఒక్క దమ్మిడీ మాత్రం అక్కడ వేశాను. ఒక పండా తిట్లుతిట్టి “నీవు ఈ విధంగా అవమానం చేస్తే నరకంలో పడతావు” అని శపించాడు. “అయ్యా, నా కర్మ ఎలా కానున్నదో కానీయండి. మీరు యిట్టి దుర్భాష నోటితో పలుకకూడదు. ఈ దమ్మిడీ తీసుకుంటే తీసుకోండి. లేకపోతే యిది కూడా మీకు దక్కదు” అని నేనన్నాను. “పో, నీ దమ్మిడీనాకు కావాలనుకున్నావా? పో, పో” అని పండా యింకో నాలుగు తిట్లు వడ్డించాడు. ఆ దమ్మిడీని తీసుకొని బయటపడ్డాను. “పండా మహాశయుడికి దమ్మిడీ నష్టం, నాకు దమ్మిడి లాభం...” అని నేను అనుకున్నాను. కాని ఆయన దమ్మిడి కూడా పోనిచ్చేరకం కాదు. అతడు నన్ను వెనక్కి పిలిచి “మంచిది. అక్కడ వుంచు, నేను నీ మాదిరిగా చేయకూడదు. నేను తీసుకోకపోతే నీకు అమంగళం కలుగుతుంది” అని అన్నాడు.

నేను మాట్లాడకుండా దమ్మిడీ అక్కడ బెట్టి తిరుగుముఖం పట్టాను.

తరువాత ఒకటి రెండు సార్లు కాశీ విశ్వనాధుని దగ్గరకు వెళ్ళాను. కాని అప్పటికి నాకు మహాత్మ బిరుదు లభించింది. కావున 1902 వ ఏట కలిగిన అనుభవం ఇప్పుడు ఎలా కలుగుతుంది? ఇప్పుడు నేనే దర్శన పాత్రుణ్ణి అయిపోయాను. యిక నాకు అప్పటిలాంటి దృశ్య దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది? మహాత్ముల కష్టాలు మహాత్ములకే ఎరుక. యిక ఆలయం విషయం. అక్కడ ఒకటే కమురుకంపు. గతంలో ఆలయం లోపల ఎలా వున్నదో ఇప్పుడూ అలాగే వుంది.