పుట:సత్యశోధన.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

బొంబాయిలో నివాసం

ఎవరికైనా దేవుని దయ మీద సందేహం వుంటే వాళ్లిటువంటి తీర్ధ క్షేత్రాల్ని చూతురుగాక. ఆ మహాయోగి పరమేశ్వరుడు తన పేరిట జరుగుతున్న మోసం అధర్మం దుర్మార్గం అలా ఎందుకు సహిస్తున్నాడో తెలియదు.

‘యే యధా మాం ప్రపద్యంతే తాంస్తథైవభజామ్యహమ్’ ఎవరు ఎట్లా నన్ను కొలుస్తారో వారికి అట్టి ఫలం యిస్తాను. అని భగవానుడు చెప్పాడు. కర్మను ఎవడు మార్చగలడు? మధ్యన భగవానుడు తానెందుకు కల్పించుకోవాలి? ధర్మాన్ని యిలా నిర్ధారించి ఆయన అంటే భగవంతుడు అంతర్హితుడైనాడు.

నేనీ అనుభవాలు వెంట బెట్టుకొని మిసెస్ బిసెంటు దర్శనానికి వెళ్ళాను. ఆమె అప్పుడు జబ్బుపడి లేచింది. నేను వచ్చానని తెలియగానే ఆమె లోపలినుండి నన్ను చూచేందుకు బయటికి వచ్చింది. నేను కేవలం దర్శనం కోసం వచ్చాను. “మీకు ఒంట్లో బాగాలేదని విన్నాను. అందువల్ల మిమ్మల్ని చూచి వెళదామని వచ్చాను. మీకు జబ్బుగా వున్నా దర్శనం యిచ్చారు. చాలు. సంతృప్తి కలిగింది. ఇంతకంటే ఎక్కువ కష్టం మీకు కలిగించను” అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాను.

21. బొంబాయిలో నివాసం

నేను బొంబాయిలో వుండి బారిస్టరీ చేస్తూ దానితో బాటు ప్రజా సేవ చేస్తూ వుండాలని గోఖ్లేగారి కోరిక. ఆ రోజుల్లో లోక సేవ అంటే కాంగ్రెస్ సేవ అన్నమాట. అప్పుడు గోఖ్లేగారు ఒక సంస్థను స్థాపించారు. దాని పని కేవలం కాంగ్రెస్ పనులు చేయడమే.

నా కోరిక కూడా అదే. కాని బారిస్టరీలో ఆత్మవిశ్వాసం తక్కువ. పూర్వానుభవాల్ని నేను మరచిపోలేదు. కేసుల కోసం వాళ్ళను వీళ్ళను ప్రాధేయపడటం నాకు నచ్చదు.

అందువల్ల మొదట నేను రాజకోటలోనే మకాం పెట్టాను. అక్కడ నా హితైషులు, నన్ను ఇంగ్లాండుకు పంపిన వారు నగు కేవల్‌రాం మావజీదవే గారు మూడు కేసులు తెచ్చి యున్నారు. అందు రెండు అప్పీళ్ళు. కాఠియావాడ్ జుడిషియల్ అసిస్టెంట్ దగ్గర వాటి విచారణ జరుగుతున్నది. మిగిలినది అసలు దావా. అది జామ్ నగర్‌లో జరుగుతున్నది. అది పెద్ద దావా. ఈ దావాలో గెలిపిస్తానని పూచీ పడలేనని చెప్పాను. ‘ఓడిపోయేది మేము కదా! నీవు శక్తి కొద్ది పనిచేయి. నేను నీతో వుంటాను!’ అని కేవలరాం గారు అన్నారు. ప్రతిపక్షాల వకీలు కీ.శే సమర్ధ్. నేను కేసు క్షుణ్ణంగా చదివాను. నాకు ఇండియన్‌లా బాగారాదు. కేవలరాంగారు నాకు నూరి పోశారు.